మేత.. మోత
ABN , First Publish Date - 2021-12-28T05:15:24+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా పాడి పరిశ్రమదారులపైనా వడ్డనకు రంగం సిద్ధం చేసింది.
పశువుల దాణాపైనా బాదుడే
మరింత పెరగనున్న దాణా ధరలు
లైసెన్సుల పేరుతో వడ్డనకు రంగం సిద్ధం
కొత్త సంవత్సరంలో పాడి పరిశ్రమదారులకు షాక్
నిబంధనలు మీరితే రూ.5 లక్షల వరకు జరిమానా
జీఎస్టీ మినహాయింపు ఉన్నా ఫీజుల వసూళ్లకు జీవో
ఖాళీ ఖజానా నింపుకునే మార్గాన్వేషణలో ఉన్న ప్రభుత్వం పశువుల దాణాపై కన్నేసింది. జీఎస్టీ మినహాయింపు ఉన్న పాడి పరిశ్రమ ఉత్పత్తులపై వడ్డనకు సిద్ధమైంది. దాణా ఉత్పత్తులపై లైసెన్సు ఫీజుల రూపంలో భారీ వసూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అమ్మకాలు జరిపే పరిమాణం ఆధారంగా లైసెన్సు ఫీజులు నిర్ణయించినా కనీస లైసెన్సు ఫీజు రూ.25 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ 2020కి సవరణలు చేసి జీవో 27ను జారీ చేసింది. వినియోగదారుల ప్రయోజనం, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ దాణా వ్యాపారాన్ని క్రమబద్ధీకరించే పేరిట ఆంధ్రప్రదేశ్ పశుదాణా చట్టం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటుంది. అయితే ఈ నిర్ణయంతో ధరలు పెరుగుతాయని అటు పాడిపరిశ్రమ రైతులు, ఇటు వినియోగదారులను ఆందోళనకు గురవుతున్నారు.
తెనాలి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా పాడి పరిశ్రమదారులపైనా వడ్డనకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దాణా, ఇతర పశు ఆహార ఉత్పత్తుల ధరలు పెరిగి పాడిపరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో దాణాపై వివిధ రుసుముల రూపంలో వేస్తున్న భారాన్ని వ్యాపారులు భరించరు కనుక, ఆ అదనపు వస్లూను కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారు. ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా జనవరి 1 నుంచి దాణాపై వసూళ్ల పర్వం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. పశువుల దాణాతోపాటు, కుక్కలు, పిల్లులు, పందులు, చేపలు, రొయ్యలు, కోళ్లు, పెంపుడు పక్షుల వంటివాటికి వేసే దాణా, ఇతర ఆహార ఉత్పత్తులపైనా ధరల ప్రభావం పడనున్నది. కొత్త సంవత్సరంలో లైసెన్సులు తీసుకోకుండా వ్యాపారం చేసే వారిపై భారీ జరిమానాలు విధించేందుకు ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లైసెన్సులేని వ్యాపారం చేసినా, ఇతర నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డా ఒకేసారి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానాలు విధించేలా చట్టంలో ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పటికే గడ్డి, దాణా ధరలు పెరిగి పదుల సంఖ్యలో పశువులను కొనుగోలుచేసి డైరీఫారాలను ఏర్పాటు చేస్తున్న వారుకూడా ఇప్పుడు వాటిని వదిలించుకోటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ తరుణంలో దాణా రేట్లు పెరిగితే మరిన్ని మూతపడే పరిస్థితి ఉంది. పాడి పశువులకు అందించే నాణ్యమైన దాణా 50 కిలోల బస్తా మూడేళ్ల క్రితం రూ.600 దగ్గరలో ఉంటే అది ప్రస్తుతం రూ.1000 నుంచి రూ. 1400కు పెరిగిపోయింది. ఇటీవల ఒక్కో బస్తాపై రూ. 20 నుంచి రూ. 80 వరకు రేటు పెరిగిపోయింది. అయితే దాణా లైసెన్సులు, ఇతర చెల్లింపుల కారణాలను చూపుతూ దాణా ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు మరో రూ.వందల్లో రేటు పెంచేందుకు సిద్ధం అవుతున్నారనే వార్త పాడి పరిశ్రమను నడ్డివిరిచేలా చేస్తోంది. మనుషులు తినే ఆహారం విషయంలో కూడా ఇంత కఠినంగా వ్యవహరించటంలేదని, కేవలం పశుదాణాపై ఈ వసూళ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఫుడ్ ఇన్స్‌పెక్టర్, క్వాలిటీ కంట్రోల్ శాఖల్లో పెద్దసంఖ్యలో ఖాళీగా పోస్టులను భర్తీ చేయలేదు. ఈ పరిస్థిలుల్లో రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు తనిఖీల బాధ్యత పెట్టటంపై ఆయా వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
నాణ్యతా ప్రమాణాల పేరుతో..
వినియోగదారుల కోసం, దాణాలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతుంది. ఇవన్నీ గతంలోనే ఉన్నా కొత్తగా సవరణలు చేయ్యాల్సిన అవసరంలేదని దాణా కంపెనీల నిర్వాహకులు వాదిస్తున్నారు. ఒకవేళ నాణ్యతా ప్రమాణాల అంశమే కారణమైతే వాటి నిర్ధారణ కోసం పరీక్షలు, తనిఖీలు చేస్తే సరిపోతుందంటున్నారు. దీనికోసం అదనపు వసూళ్లు చేయ్యాల్సిన పనిలేదని వాదిస్తున్నారు. రొయ్యలు, కోళ్లు, కుక్కల ఆహార పదార్థాల విక్రయాలు, తయారీకి సంబంధించి ఇప్పటికే లైసెన్సు విధానం ఉంది. అయితే గతంలో రూ.వెయ్యి నుంచి రూ.4 వేల లోపు లైసెన్సు ఫీజు చెల్లించిన వీరు తాజా నిర్ణయంతో కనీసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది. పశువుల దాణాకు ఇప్పటి వరకు లైసెన్సులు, పన్నులు లేవు. తాజా నిర్ణయంతో వీరిపైనా ఆర్థిక భారం పడుతుంది. కేంద్రం నుంచే మినహాయింపులుంటే, మన రాష్ట్రంలో వీటిపై బాదుడు సరికాదని పాడి రైతుల వాదన. లైసెన్సు తీసుకున్నా దానికి బాండ్ల రూపంలో రూ.వెయ్యి నుంచి రెండు వేల వరకు చూపేవారు. ఇప్పుడు అవేమీ పనిచేయడంలేదు.
1 నుంచి దాడులు
పశువుల దాణా, ఇతర జంతు సంబంధ ఆహార పదార్థాల పేరుతో ప్రభుత్వం భారీ వడ్డింపులకు దిగుతోంది. దీనికి సంబందించిన జీవో 27ను జూన్ 10వ తేదీతోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య విడుదల చేశారు. గతంలో ఉన్న యానిమల్ ఫీడ్ యాక్ట్ 2020ని సవరించి 76 పేజీల విధివిధానాలను తీసుకొచ్చారు. దీనిప్రకారం ఈ నెల 31లోపు అందరూ లైసెన్సులు తీసుకోవాలి. ఇప్పటికే ఉన్నవారైతే రెన్యువల్ చేయించుకోవాలి. జనవరి 1 నుంచి దాడులు మొదలవుతాయి. వీరు నాణ్యతా ప్రమాణాలు, దాణాలో ఉండాల్సిన ప్రమాణాల ప్రకారం ఉండేలా తనిఖీలు చేస్తారు. తనిఖీలకు సంబంధించిన చెల్లింపులు బాధ్యత కూడా ఉత్పత్తిదారు, అమ్మకందారులదే. దాణాలో వ్యత్యాసాలున్నా, లైసెన్సు లేకుండా అమ్మకం, తయారు చేసినా రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా చెల్లించాలి. అనుమతులు లేకుండా దాణా తయారీ, విక్రయిస్తే మొదటి సారి రూ.2 లక్షలు జరిమానా, రెండోసారి దొరికితే జరిమానాతోపాటు లైసెన్స్ రద్దు, సరుకు సీజ్, క్రిమినల్ కేసులు పెడతారు. అధికారులు అడిగినప్పుడు శాంపిల్స్ ఇవ్వకుంటే మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి ఇవ్వకుంటే రూ.50 వేలు, మూడోసారి పట్టించుకోకుంటే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.
మండల స్థాయి వరకు కమిటీలు
జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. డివిజన్ స్థాయిలో సబ్‌కలెక్టర్, ఆర్డీవోల్లో ఒకరు చైర్మన్‌గా ఉంటే, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యదర్శిగా, కాలుష్య నియంత్రణ శాఖ ఏడీ, పరిశ్రమల శాఖ ఏడీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఫీడ్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన ఏడీలు సభ్యులుగా ఉంటారు. అన్ని ప్రాంతాల్లో ఆయా పశువైద్యాధికారులు, ఎ.ఎఫ్.ఐ(యనిమల్ ఫీడ్ ఇన్స్‌పెక్టర్స్)గా వ్యవహరిస్తారు. వీరు దుకాణాల్లో, కంపెనీల్లో తనిఖీలు నిర్వహిస్తారు.
లైసెన్స్ ఫీజు ఒక్కసారి చెల్లిస్తే చాలు
పశువుల దాణా పరిశ్రమలకు ఉత్పత్తి ఆధారంగా నిర్ణయించే లైసెన్సు ఫీజు ఒక్కసారి చెల్లిస్తే చాలు. అది జీవితకాల చెల్లింపు కిందికి వస్తుంది. అయితే ఇప్పటికే వ్యాపారులు, ఉత్పత్తిదారులకు ఏ శాఖ నుంచైనా లైసెన్సు గతంలో ఉన్నా, రెన్యువల్ చేయించుకున్నా, ఆ గడువు వరకు చెల్లించాల్సిన పనిలేదు. వారు కేవలం రూ.10 వేలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. ఆ గడువు ఎప్పటి వరకు ఉంటే, అప్పటి వరకు లైసెన్సు ఉన్నట్టే. ఆ తర్వాతే కొత్త చట్టం ప్రకారం లైసెన్సు తీసుకోవాలి. భారీ జరిమానాలు నాణ్యతా ప్రమాణాల విషయంలో పారదర్శకత కోసమే ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- డాక్టర్ వెంకటేశ్వర్లు, జేడీ, పశుసంవర్థకశాఖ, గుంటూరు