అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-01-13T05:50:02+05:30 IST

చిక్కు వెంట్రుకలు కొనుక్కునే వారిలాగా ఇళ్లవెంట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర రాష్ట్ర దొంగల ముఠాను పాతగుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అంతర రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌
స్వాదీనం చేసుకున్న ఆభరణాలు పరిశీలిస్తున్న అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, అదనపు ఎస్పీ మనోహరరావు

రూ.6,96,450 ఖరీదైన సొత్తు స్వాధీనం

నిందితులపై పలు జిల్లాల్లో 26కి పైగా కేసులు


 గుంటూరు, జనవరి 12: చిక్కు వెంట్రుకలు కొనుక్కునే వారిలాగా ఇళ్లవెంట తిరుగుతూ తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర రాష్ట్ర దొంగల ముఠాను పాతగుంటూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి వివరాలు వెల్లడించారు.. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని పారిచర్లకు చెందిన రంగనాఽథం కిరణ్‌, విజయ్‌, నారాయణమ్మ, నరసమ్మ ఎంతో కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. గడచిన మూడు నెలలుగా వీరు ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు అర్బన్‌లో పలు నేరాలకు పాల్పడ్డారు. ఈ నెల 5న పాతగుంటూరులోని మంగళదాస్‌నగర్‌లో ఓ ఇంటిలో ఇదేవిధంగా చోరీకి పాల్పడ్డారు.  అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈస్ట్‌ డీఎస్పీ బి.శీతారామయ్య ఆధ్వర్యంలో పాతగుంటూరు సీఐ ఆర్‌.సురేష్‌బాబు, ఎస్‌ఐలు టి.నాగరాజ్‌, ఎస్‌కే ఎండీ మేరాజ్‌ సిబ్బంది రంగంలోకి దిగి కేసు ఛేదించారు. పట్టుబడిన నిందితులపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో 26కి పైగా కేసులు ఉన్నట్లు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.  నిందితుల నుంచి రూ.6 లక్షల 96 వేల 450 ఖరీదైన 128.5 గ్రాముల బంగారం, 47,500 నగదు, రెండు ఎల్‌ఈడీ టీవీలు, ట్యాబ్‌ను స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అంతర రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్‌ చేసిన అధికారులు, సిబ్బందిని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించి నగదు రివార్డులు అందించారు.  అదనపు ఎస్పీ మనోహరరావుతో పాటు ఆయా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:50:02+05:30 IST