ఆంధ్రజాతి సంపద విశాఖ ఉక్కు

ABN , First Publish Date - 2021-02-06T05:24:59+05:30 IST

ఆంధ్రజాతి సంపద విశాఖ ఉక్కని.. ఆ సంస్థను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

ఆంధ్రజాతి సంపద విశాఖ ఉక్కు
అమృతరావు విగ్రహానికి పూలమాలు వేస్తున్న సీపీఐ రామకృష్ణ, ముప్పాళ్ల, కొలికపూడి తదితరులు

32 మంది వీరుల ప్రాణాత్యాగానికి చిహ్నం

నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

గుంటూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజాతి సంపద విశాఖ ఉక్కని.. ఆ సంస్థను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్‌లో శుక్రవారం అంబేద్కర్‌ విగ్రహం వద్ద జరిగిన ఆందోళనలో ఆయన ప్రసంగించారు. ఆర్థిక, పారిశ్రామిక రంగాలను అంబానీ, ఆదానీలకు దారాదత్తం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం నాడు ‘విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు’ అంటూ విద్యార్థి, యువజన సంఘాల పోరాటాలతో పాటు 70 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలానే ఆ ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ఇటువంటి సంస్థను ప్రైవేటు పరం చేస్తే మరో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేసిన అమృతరావు  విగ్రహం వరకు పాదయాత్ర చేసి ఆయనకు నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్‌ కుమార్‌, కోట మాల్యాద్రి తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-06T05:24:59+05:30 IST