1,584 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-05-21T05:01:48+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్నది.

15.09గా పాజిటివ్ శాతం
మరో 10 మంది మృతి
గుంటూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోన్నది. గురువారం ఉదయం వరకు 10,497 శాంపిల్స్‌ని పరీక్షించి విశ్లేషించగా 1,584 మందిలోకి వైరస్ ప్రవేశించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ రేట్ 15.09గా నమోదైంది. కేసులు కాస్త తగ్గాయని భావిస్తోన్న తరుణంలో మరణాలు పెరుగుతోన్నాయి. గడిచిన 24 గంటల్లో మంగళగిరిలో ఇద్దరు, గుంటూరు నగరంలో ఇద్దరు, తుళ్లూరు, తాడేపల్లి, మాచవరం, చిలకలూరిపేట, బాపట్ల, కాకుమానులో ఒక్కొక్కొరు చనిపోయారు. మొత్తం 10 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా గుంటూరు నగరంలో 443, మంగళగిరిలో 77, నరసరావుపేటలో 72, బాపట్లలో 61, సత్తెనపల్లిలో 59, పెదకాకానిలో 56, మాచర్లలో 54, పిడుగురాళ్లలో 51, తాడేపల్లిలో 43, తెనాలిలో 37, అమరావతిలో 6, అచ్చంపేటలో 24, బెల్లంకొండలో 5, గుంటూరు రూరల్‌లో 25, క్రోసూరులో 22, మేడికొండూరులో 18, ముప్పాళ్లలో 7, పెదకూరపాడులో 15, పెదనందిపాడులో 20, ఫిరంగిపురంలో 9, ప్రత్తిపాడులో 14, రాజుపాలెంలో 22, తాడికొండలో 7, తుళ్లూరులో 6, వట్టిచెరుకూరులో 11, దాచేపల్లిలో 27, దుర్గిలో 14, గురజాలలో 22, కారంపూడిలో 24, మాచవరంలో 10, రెంటచింతలలో 14, వెల్దుర్తిలో 5, బొల్లాపల్లిలో 2, చిలకలూరిపేటలో 34, యడ్లపాడులో 12, ఈపూరులో 2, నాదెండ్లలో 45, నూజెండ్లలో 2, నకరికల్లులో 21, రొంపిచర్లలో 12, శావల్యాపురంలో 2, వినుకొండలో 7, భట్టిప్రోలులో 12, చేబ్రోలులో 6, చెరుకుపల్లిలో 10, దుగ్గిరాలలో 18, కాకుమానులో 8, కర్లపాలెంలో 9, కొల్లిపరలో 5, కొల్లూరులో 7, నగరంలో 15, నిజాంపట్నంలో 8, పిట్టలవానిపాలెంలో 3, పొన్నూరులో 13, రేపల్లెలో 27, చుండూరులో 11, వేమూరులో 6 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.
నగరంలో చిరునామాలు దొరకడం లేదు
గత కొద్ది రోజుల నుంచి గుంటూరు నగరంలో నమోదు అవుతోన్న పాజిటివ్ కేసులకి, వారిలో చిరునామా లభిస్తోన్న సంఖ్యకి పొంతన ఉండటం లేదు. గురువారం నగరంలో 443 కొత్త కేసులు రాగా నగరపాలకసంస్థ అధికారులు కేవలం 197 కేసులను మాత్రమే గుర్తించగలిగారు. దాదాపుగా 50 శాతం పైగా కేసులకు సంబంధించి చిరునామాలు లభించడం లేదని కార్పొరేషన్ వర్గాలు చెబుతోన్నాయి. ఇదేవిధంగా మంగళవారం 402 మందికి పాజిటివ్ అని డీఎంహెచ్‌వో ప్రకటించగా చిరునామాలు 304 మందివే లభించాయి. గత ఆదివారం 578 మందికి పాజిటివ్‌గా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ప్రకటించగా నగరపాలకసంస్థ వర్గాలకు 404 మందివే చిరునామాలు లభించాయి. ఇలా నిత్యం 100 మందికి పైగా పాజిటివ్‌గ్రస్థుల చిరునామాలు లభించకపోతోండటం ఆందోళన కలిగిస్తోన్నది. చిరునామాలు లభించక వారిని ఐసోలేషన్ చేయకపోతే వైరస్ మరి కొంతమందికి వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు.
విచ్ఛలవిడిగా యాంటీజెన్ టెస్టులు
నగరంలో విచ్ఛలవిడిగా కరోన యాంటీజెన్ టెస్టులు చేస్తోన్నారు. అధికారికంగా ట్రూనాట్ 490, ప్రైవేటు యాంటీజెన్ 346, ప్రభుత్వ యాంటీజెన్ 2,491 మందికి టెస్టులు చేశారు. అనధికారికంగా ఈ సంఖ్య ఐదు వేలకు పైనే ఉంటోన్నది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ల్లో పని చేసే సిబ్బంది యాంటీజెన్ కిట్స్ సమకూర్చుకొని నేరుగా కరోన అనుమానితుల ఇళ్లకు వెళుతోన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ. 1000 తీసుకొని యాంటిజెన్ కిట్స్ ద్వారా టెస్టులు చేసి అప్పటికప్పుడు పాజిటివ్/నెగెటివ్ చెప్పేస్తోన్నారు. అయితే ట్రూనాట్, యాంటీజెన్ టెస్టుల ఫలితాలు 100 శాతం కరెక్టు కాదని అధికారవర్గాలే చెబుతోన్నాయి. ఆయా టెస్టుల్లో పాజిటివ్ అని తేలినవాళ్లు మళ్లీ ఆర్‌టీపీసీఆర్/చెస్టు స్కానింగ్‌కు వెళుతోన్నారు. ఫలాన చోట చెస్టు స్కానింగ్‌కి వెళ్లమని టెస్టులు చేస్తోన్న వారే సిఫార్సు చేస్తోన్నారు. ఈ విధంగా స్కానింగ్ సెంటర్ల వద్ద ఒక్కో వ్యక్తిని పంపించినందుకు రూ. వెయ్యి వరకు కమీషన్ రూపంలో పొందుతోన్నారు. రెమిడేసివర్ వలే ట్రూనాట్/యాంటీజెన్ కిట్స్‌పై ప్రభుత్వం నియంత్రణ పెట్టడం లేదు.