12 రోజులు.. 20,933 కేసులు
ABN , First Publish Date - 2021-05-13T05:48:36+05:30 IST
ఈ నెలలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉచ్ఛస్థితిలో విజృంభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదు అవుతున్నాయి.

జిల్లాలో ఉధృతంగా సెకండ్ వేవ్
పాజిటివ్‌రేట్ 16.96 శాతం నమోదు
తాజాగా 1,836 మందికి కరోనా వైరస్
అధికారికంగా ఎనిమిది మంది మృతి
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గుంటూరు నగరంతో పాటు పట్టణాలు, గ్రామాలను కూడా వైరస్ చుట్టేస్తోంది. కరోనా కర్ఫ్యూ అమల్లో ఉన్నా కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. నిత్యం రెండు వేలకు అటుఇటుగానే కేసులు వస్తున్నాయి. ఇవన్నీ అధికారికంగానే. ఇక అనధికారికంగా ప్రైవేటు ల్యాబుల్లో టెస్టులు చేయించుకుని చికిత్సలు పొందుతున్న వారెందరో లెక్కలకు అంతుచిక్కడంలేదు. ఈ నెలలో 12 రోజుల్లోనే 20,933 మందికి వైరస్ సోకింది. ఇదేతీరున పాజిటివ్ రేట్ కొనసాగితే నెలాఖరుకు ఇంచుమించుగా 45 వేలకు పైగా కేసులు ఈ నెలలోనే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తోన్నాయని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. మరణాలు అయితే గత నెలలో అధికారికంగా 49 కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 84 చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
గుంటూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెలలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉచ్ఛస్థితిలో విజృంభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి జిల్లాలో కొనసాగుతున్నది. బుధవారం ఉదయం వరకు 10,824 శాంపిల్స్ ఫలితాలు రాగా అందులో 1,836 మందికి వైరస్ సోకింది. పాజిటివ్ రేట్ 16.96గా నమోదైంది. కొవిడ్‌తో ఎనిమిది మంది చనిపోయారు. గుంటూరు నగరంలో 4, మంగళగరిలో 3, సత్తెనపల్లిలో ఒకరు మరణించారు. మరో 11,058 మంది కరోనా టెస్టులు చేయించుకున్నారు. కొత్తగా గుంటూరు నగరంలో 734 మందికి వైరస్ సోకింది. ప్రధానంగా శ్రీనివాసరావుతోటలో 32, ఏటీఅగ్రహారంలో 28, ఆర్టీసీ కాలనీలో 25, బాలాజీనగర్‌లో 22, ఆటోనగర్‌లో 21, రాజీవ్‌గాంధీనగర్‌లో 19, నెహ్రూనగర్‌లో 16, పాతగుంటూరులో 16, పట్టాభిపురంలో 14, స్వర్ణభారతీనగర్‌లో 14, కేవీపీ కాలనీలో 12, సంగడిగుంటలో 12, బ్రాడీపేటలో 11, నల్లపాడులో 11, నల్లచెరువులో 10, యాదవబజార్‌లో 10 మందితో కలిపి మొత్తం 151 కాలనీల్లో కొత్తగా వైరస్ కేసులు వచ్చినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. మంగళగిరిలో 87, అమరావతిలో 77, నరసరావుపేటలో 65, తాడేపల్లిలో 63, తుళ్లూరులో 59, మాచర్లలో 53, బాపట్లలో 47, రేపల్లెలో 46, చిలకలూరిపేటలో 45, సత్తెనపల్లిలో 42, తెనాలిలో 41, అచ్చంపేటలో 26, బెల్లంకొండలో 3, గుంటూరు రూరల్‌లో 9, క్రోసూరులో 21, మేడికొండూరులో 26, ముప్పాళ్లలో 12, పెదకాకానిలో 39, పెదకూరపాడులో 3, పెదనందిపాడులో 12, ఫిరంగిపురంలో 20, ప్రత్తిపాడులో 11, రాజుపాలెంలో 8, తాడికొండలో 36, వట్టిచెరుకూరులో 14, దాచేపల్లిలో 9, దుర్గిలో 3, గురజాలలో 3, కారంపూడిలో 5, మాచవరంలో 11, పిడుగురాళ్లలో 23, రెంటచింతలలో 3, వెల్దుర్తిలో 2, బొల్లాపల్లిలో 6, యడ్లపాడులో 1, ఈపూరులో 2, నాదెండ్లలో 11, నూజెండ్లలో 6, నకరికల్లులో 12, రొంపిచర్లలో 6, శావల్యాపురంలో 2, వినుకొండలో 2, అమర్తలూరులో 9, భట్టిప్రోలులో 5, చేబ్రోలులో 5, చెరుకుపల్లిలో 12, దుగ్గిరాలలో 10, కాకుమానులో 5, కర్లపాలెంలో 4, కొల్లిపరలో 13, కొల్లూరులో 3, నగరంలో 10, నిజాంపట్నంలో 8, పిట్టలవానిపాలెంలో 11, పొన్నూరులో 24, చుండూరులో 9, వేమూరులో 2 పాజిటివ్ కేసులు వచ్చినట్లు జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టీ జయసింహా తెలిపారు.
7,991 మందికి రెండో డోస్ వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేసుకుని రద్దీ, ఇతర కారణాలతో రెండో డోస్ తీసుకోకుండా మిగిలిపోయిన వారికి ప్రణాళికాబద్ధంగా సెకండ్ డోస్ వేస్తోన్నారు. బుధవారం మొత్తం 7,991 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తామని పేర్కొన్నాయి.
మూడు రోజులుగా తగ్గిన డిశ్చార్జ్‌లు
కరోనా వైరస్ సోకిన డిశ్చార్జి అవుతోన్న వారి సంఖ్య గత మూడు రోజులుగా తగ్గింది. క్రితం వారం రోజుకు 2 వేల వరకు డిశ్చార్జిలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 300లకు పడిపోయింది. డిశ్చార్జిలు తగ్గే కొద్దీ ఆస్పత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో నోడల్ ఆఫీసర్లు ఆస్పత్రుల వారీగా ఆడిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
కరోనా లక్షణాలతో ముగ్గురి మృతి
కరోనా లక్షణాలతో గుంటూరు ఎల్‌వీఆర్ క్లబ్ మాజీ కార్యదర్శి ఆరెకపూడి సుబ్బారావు(85) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన కొన్ని రోజులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నారు. అయితే ఆరోగ్యం విషమించి మంగళవారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శిగా, ఆలిండియా క్యారమ్స్ అధ్యక్షుడిగా రెండు సార్లు వ్యవహరించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుంటూరులో మొదటి సారిగా జాతీయ స్థాయి వాలీబాల్, జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. క్రీడల్లో ముందుండే యువతకి క్లబ్ తరపున ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహించారు. ఎల్‌వీఆర్ క్లబ్ కార్యవర్గంతో పాటు పలువురుసుబ్బారావు మృతికి సంతాపం తెలిపారు.
డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడి మృతి
ఏపీ డీబీఎఫ్ రాష్ట్రఅధ్యక్షుడిగా దళితుల సమ్యలపై నిరంతరం పోరాటం చేసే గుంటూరుకు చెందిన జెల్ది ఇస్మాయిల్‌బాబు (61) కరోనా లక్షణాలతో బుధవారం మృతి చెందారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా గుంటూరు ఆనందపేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపై కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే ముస్తఫా, డీబీఎఫ్ జాతీయ నాయకులు కొరివి వినయకుమార్, మేళం భాగ్యారావు తదితరులు సంతాపం తెలిపారు. బ్యాంక్‌ఆఫ్ ఇండియాలో ఉద్యోగ విరమణ చేసిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల యూనియన్ రాష్ట్రకార్యదర్శిగా, అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా, డిక్కీలో రాష్ట్ర కోఆర్డినేటర్‌గా తదితర బాధ్యతలు నిర్వహించారు.
జీఎంసీలో కరోనా మరణాలు
గుంటూరు నగరపాలక సంస్థలో కరోనా విలయతాండవం చేస్తుంది. నాలుగు రోజుల క్రితం అకౌంట్స్ విభాగంలో యలమందమ్మ అనే ఉద్యోగి కరోనా లక్షణాలతో మృతి చెందగా బుధవారం అదే విభాగంలో పనిచేస్తున్న అంగజాల శంకరరావు (56) అనే ఉద్యోగి మృతి చెందారు. లాలాపేట, అరండల్‌పేట, చౌత్రా సెంటర్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు కూడా కరోనాకు బలి అయ్యారు.
450 రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల సరఫరా
గుంటూరు(తూర్పు): జీజీహెచ్‌కు 450 డోసుల రెమ్‌డెసివర్ ఇంజె క్షన్లు బుధవారం కేంద్ర ఔషధ భాండాగారం నుంచి సరఫరా అయినట్లు ఈఈ శ్రీనివాసరావు తెలిపారు. నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి 20, తెనాలి ఆస్పత్రికి 48, గుంటూరు జ్వరాల ఆస్పత్రికి 12, సత్తెనపల్లి ఆస్పత్రికి 18 రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు సరఫరా చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులకు 1633 డోసుల ఇంజెక్షన్లు అందజేసినట్టు డ్రగ్ కంట్రోలర్ ఏడీ అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లాకు 70.2 టన్నుల ఆక్సిజన్ వచ్చిందన్నారు.
పిల్లల కోసం సంరక్షణ కేంద్రాలు
గుంటూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): కరోనాతో మృతి చెందిన, చికిత్స పొందుతున్న తల్లిదండ్రుల పిల్లల బాగోగులు చూసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎన్‌జీవోలతో మాట్లాడి జిల్లాలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఫిరంగిపురంలో బాలికల కోసం కార్డ్స్ అనే సంస్థ, గుంటూరు నగరంలో వెంకటేశ్వర మహిళా మండలి, బాలురు కోసం ఓపెన్ షెల్డర్, తాడేపల్లికి సమీపంలోని వెంకటాయపాలెంలో బాలలు, బాలికల కోసం చిగురు ఆశ్రమం, మాచర్లలో స్వామి వివేకానంద స్టూడెంట్స్ హోం(బాలురు) ఏర్పాటు చేశారు. వీటికి ఇన్‌చార్జిగా జిల్లా పంచాయతీ అధికారిని నియమించారు. ఆయన ఫోన్ నెంబర్ 9441449354ని అందుబాటులో ఉంచారు. అలానే ఎన్‌జీవోలు సీహెచ్ సుప్రియ(6305540634), జీవన్(9700763638), అనీల్(8985618195), గోవింద రెడ్డి(9440006813) నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
ప్రాధాన్య క్రమంలో రెండో డోసు
చికిత్సలకు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు
వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ వివేక్‌యాదవ్
గుంటూరు(కార్పొరేషన్), మే 12: ప్రాధాన్య క్రమంలోనే రెండో డోస్ వ్యాక్సిన్‌ను వేయడం జరుగుతోందని కలెక్టర్ వివేక్‌యాదవ్ తెలిపారు. బుధవారం స్థానిక భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయం, గుజ్జనగుండ్లలోని మహిళా పాలిటెక్నికల్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారితో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. మొదటి విడతలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు?, ఎప్పుడు తీసుకున్నారు.. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా అనే ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల సమస్యలు ఏర్పడ్డాయన్నారు. అందువల్ల వ్యాక్సిన్ వేసుకునే వారికి ముందస్తుగానే టోకెన్ అందివ్వడం జరుగుతుందన్నారు. ప్రతి మండల కేంద్రంలో శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుంటూరులో 10, తెనాలిలో 3, నరసరావుపేటలో 2 చొప్పున వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రెండో డోసు అందరికీ పూర్తి అయిన తర్వాత మిగిలిన వారికి మొదటి డోసు కార్యక్రమం చేపడతామన్నారు. కరోనా చికిత్సలు, టెస్టులకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేసే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, గుంటూరు తూర్పు మండల తహసీల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.