వ్యాక్సిన్లు వచ్చేశాయ్‌

ABN , First Publish Date - 2021-01-14T04:32:57+05:30 IST

కరోనా టీకా మందు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు జిల్లాకు చేరుకున్నాయి. పుణే నుంచి ప్రత్యేక విమానం ద్వారా మంగళవారం సాయంత్రం వ్యాక్సిన్లు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరాయి.

వ్యాక్సిన్లు వచ్చేశాయ్‌
కరోనా వ్యాక్సిన్‌ను చూపుతున్న కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, డీఎంహెచ్‌వో తదితరులు

జిల్లాకు చేరిన 4,350 వైల్స్‌ 

రేపటి నుంచి వ్యాక్సినేషన్‌ షురూ

తొలివిడతలో 43,500 మందికి వ్యాక్సిన్‌ 

పరిశీలించిన కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌


గుంటూరు (మెడికల్‌), జనవరి 13: కరోనా టీకా మందు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు జిల్లాకు చేరుకున్నాయి. పుణే నుంచి ప్రత్యేక విమానం ద్వారా మంగళవారం సాయంత్రం వ్యాక్సిన్లు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరాయి. అక్కడ నుంచి బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి చేరాయి. తొలి విడతగా జిల్లాకు 4,350 వైల్స్‌ అందాయి. దీంతో తొలి విడతలో జిల్లా లో 43,500 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి కొవిషీల్డ్‌ టీకా మందు ఇచ్చేందుకు ఆస్కార ం ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని శీతలీకరణ గదుల్లో భద్రపర్చిన కరోనా వ్యాక్సిన్లను బుధవారం కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ పరిశీలించారు మొదటి విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జనవరి 16న చేపడుతున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 31 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరుగుతుందని, ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి వ్యాక్సిన్‌ వేస్తారని ఆయన వివరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌(అభివృద్ధి, సచివాలయాలు) పి.ప్రశాంతి, డీఎంహెచ్‌వో జె.యాస్మిన్‌, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి చుక్కా రత్న మన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


41 మందికి కరోనా

గడిచిన 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 41 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. బుధవారం ఉదయం వరకు అందిన 5,237 శాంపిల్స్‌ ఫలితాల్లో పాజిటివ్‌ శాతం 0.78గా నమోదైంది. మిగతా 5,196(99.22 శాతం) మందికి నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా మంగళగిరిలో 8, గుంటూరు నగరంలో 6, రేపల్లెలో 5, బెల్లంకొండలో 4, నరసరావుపేటలో 3, ముప్పాళ్లలో 3, పెదనందిపాడులో 2, మేడికొం డూరులో 2, గురజాలలో 2, బాపట్ల, చిలకలూరి పేట, దుగ్గిరాల, కొల్లిపర, నిజాంపట్నం, పొన్నూరు లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు జిల్లాలో 76,836 మందికి వైరస్‌ సోకగా వారిలో 75,798(98.65 శాతం) మంది కోలు కొన్నారు. ప్రస్తుతం 308 మంది చికిత్స పొందు తుండగా 730 మంది చనిపోయారు.  

Updated Date - 2021-01-14T04:32:57+05:30 IST