నోటీసులతో.. నాన్చుడు

ABN , First Publish Date - 2021-12-08T05:22:16+05:30 IST

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.

నోటీసులతో.. నాన్చుడు

నిర్మాణాల కూల్చివేతలపై కాలయాపన

అక్రమ భవనాలపై చర్యల్లో మినహాయింపు

గుంటూరులో మూడు నెలలైనా తొలగని కట్టడాలు

నగర పాలక సంస్థ అధికారులపై ఎన్నెన్నో ఆరోపణలు


గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 7: గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్లాన్‌ ఒకలా తీసుకుని మరోలా నిర్మాణాలు కొందరు చేస్తుండగా.. మరికొందరు చేపట్టే నిర్మాణాలకు.. అనుమతులకు సంబంధం లేకుండా ఉంది. ఇదెక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. నగర నడి మధ్య వ్యాపార కేంద్రాల్లోనే. ఇదంతా తెలిసినా నగర పాలక సంస్థ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎదో నామ్‌కేవాస్తీగా నోటీసులు ఇచ్చామన్నట్లు ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ కట్టడాల విషయంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల తీరు అనేక ఆరోపణలకు ఆస్కారం కలిగిస్తుంది. కొన్ని కట్టడాలను పట్టించుకోని అధికారులు మరికొన్నింటిపై దూకుడు ప్రదర్శిస్తుండటం అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అక్రమ కట్టడాలను గుర్తించిన అధికారులు ఈ మూడు నెలల్లో 218 భవన యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇక సొంతంగా నిర్మాణాలు కూల్చుకునేందుకు ఆరుగురికి మినహాయింపు ఇచ్చారు. మొత్తం మీద ఇప్పటికి 18 నిర్మాణాలపైనే చర్యలు తీసుకున్నారు. అయితే 218 మందిలో 157 మంది నుంచి స్పందన రాకపోవడంతో రెండో సారి నోటీసులు ఇచ్చారు. మూడో సారి 62 మందికి నోటీసులు ఇచ్చారు. అంటే నగర పాలక సంస్థ అధికారులు ఇచ్చే నోటీసులకు నిర్మాణదారులు ఎలా స్పందిస్తున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇలా వరుసగా నోటీసులు ఇవ్వడానికే అధికారులు పరిమితమవుతున్నారే కాని వారిపై చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ చూపడం లేదు. మూడు నెలల క్రితం ఆంధ్రజ్యోతి సంచికలో అక్రమ కట్టడాలపై కఽథనాలు ప్రచురితమవగా గార్డెన్స్‌లో అరకొరగా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. మిగిలిన భవనాలకు నోటీసులు మాత్రం జారీ చేసి అక్రమ కట్టడాలను సొంతంగా తొలగించుకోవాలని హెచ్చరించారు. అయితే వారు ఆ కట్టడాలను తొలగించుకోక పోగా నిర్మాణాలను పూర్తి చేసుకుని ప్రారంభోత్సవాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-12-08T05:22:16+05:30 IST