బస్‌బేలపై.. రగడ!

ABN , First Publish Date - 2021-08-28T05:28:47+05:30 IST

నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం వాడివేడిగా జరిగింది.

బస్‌బేలపై.. రగడ!
మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ అధ్యక్షతన కొలువుతీరిన కౌన్సిల్‌ సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు గిరి, ముస్తఫా, కార్పొరేటర్లు

నిబంధనలకు విరుద్ధమన్న డిప్యూటీ మేయర్‌

టెండర్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందంటూ ఆరోపణ

స్వపక్షమే కాదన్నా.. బస్‌బేలకు ఆమోదముద్ర

వాడివేడిగా కౌన్సిల్‌ అత్యవసర సమావేశం

19 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం

గుంటూరు(కార్పొరేషన), ఆగస్టు 27: నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం వాడివేడిగా జరిగింది. సమావేశంలో మొత్తం 20 అంశాల అజెండాలో చెత్త పన్ను మినహా మిగిలిన 19 అంశాలకు కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది. కార్పొరేషనలో మేయర్‌ కావటి మనోహర్‌ అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా నగరంలో 20 చోట్ల మోడరన బస్‌బేల నిర్మాణానికి కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. కాగా.. దీనిపై డిప్యూటీ మేయర్‌ వనమా బాల వజ్రబాబు(డైమండ్‌ బాబు) తీవ్ర అభ్యంతరం తెలిపారు. బస్‌బేల వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, పలువురు కార్పొరేటర్లు కూడా వ్యతిరేకించారు. బస్‌బేల నిర్మాణ ప్రతిపాదనలు కేంద్ర విజిలెన్స, కాగ్‌, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని డైమండ్‌ బాబు అన్నారు. భవాని యాడ్స్‌, యాడ్స్‌ అండ్‌ యాడ్స్‌ అనే రెండు సంస్థలు బినామీ పేర్లతో ఒక్కరే నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల కాలపరిమితితో నగరంలో 20 చోట్ల సుమారు 2వేల చదరపు గజాల స్థలాన్ని ఇస్తున్నామని, ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో జీఎంసీ స్థలాలు అన్యాక్రాంతం అవుతాయని ఆవేదన చెందారు. కార్పొరేటర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. స్విస్‌ చాలెంజస్‌ పద్ధతి కాదని ఓపెన టెండర్‌ ద్వారా చేపట్టిన ప్రక్రియ అంతా లోపభూయిష్టంగా ఉందన్నారు. మొత్తం 12 అంశాలతో కూడిన అభ్యంతరాలను, జీవోలను ఉన్నతాధికారుల ఆదేశాల కాపీని సభలో మేయర్‌, కమిషనర్‌కు అందజేశారు. ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం లక్ష్మీపురం మెయినరోడ్డులో ఉన్న ఈబస్‌బేను ఎవరూ వినియోగించుకోవడం లేదని, ఇప్పడు 20 చోట్ల ఈ తరహాలో బస్‌బేల నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు. ప్రైవేటు సిటీ బస్సులు మాత్రమే నగరంలో నడుస్తున్నాయని, ఈ బస్‌బేలు మెట్రో పాలిటన సిటీలకు మాత్రమే పరిమితమని పేర్కొన్నారు. టీడీపీ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌ మాట్లాడుతూ నెలవారి అద్దె రూ.12 వేలు తక్కువని, దానిని పెంచాలని సూచించారు. అయితే వీటి నిర్వహణ కూడా పారదర్శకంగా ఉండాలని తెలిపారు. ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరి జోక్యం చేసుకుని నగర సుందరీకరణలో భాగంగా బస్‌బేలను ఏర్పాటు చేస్తున్నామంటూ దీనికి ఆమోదం తెలిపారు.  

వైసీపీ వర్సెస్‌ టీడీపీ..

యూజీడీపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫాకు టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది.  పలువురు వైసీపీ కార్పొరేటర్లు వారిస్థానం నుంచి ముందుకు దూసుకువచ్చారు. ఈ తీరుపై టీడీపీ కార్పోరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుక్కలు పట్టే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో  టీడీపీ, వైసీపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 


చెత్త సేకరణ పన్ను పెంపు తాత్కాలిక వాయిదా

నగర ప్రజలపై చెత్త పన్ను పెంపు ప్రతిపాదనను కౌన్సిల్‌లో తాత్కాలికంగా వాయిదా వేశారు. చెత్తపన్ను పెంపును టీడీపీ కార్పొరేటర్లు కోవెలమూడి రవీంద్ర(నాని), కొమ్మినేని కోటేశ్వరరావు, ఈరంటి వరప్రసాద్‌, యల్లావుల అశోక్‌యాదవ్‌, నూకవరపు బాలాజితో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాయిదా వేశారు. గతంలో నిర్వహించిన చెత్త టెండర్లను ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రద్దు చేస్తామని కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు. నగరంలో చెత్త పన్ను పెంపును వాయిదా వేయడంపై కమిషనర్‌ అనురాధ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న టెండర్లను రద్దు చేసి కొత్త చెత్త సేకరణ విధా నాన్ని అమలు చేస్తామన్నారు. యునిడో సహకారంతో ఆటోలు కొనుగోలు చేసి వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి జీఎంసీనే చెత్త సేకరణ చేపడుతుందన్నారు. మురికివాడల్లో రూ.60, మిగిలిన ప్రాంతాల్లో రూ.120, వాణిజ్య భవనాలకు రూ.1500-3000 వరకు ఆయా భవనాల విస్తీర్ణాన్ని బట్టి పన్నులు విధించనున్నట్లు ఆమె వివరించారు.

19 అంశాలకు కౌన్సిల్‌ ఆమోదం

నగరపాలక సంస్థలో జరిగిన అత్యవసర సమావేశంలో 20 అంశాలతో అజెండాను ప్రవేశపెట్టగా అందులో 19 అంశాలకు ఆమోదం తెలిపింది. ఇందులో బస్‌బేలకు అనుమతి, ఎల్‌ఈడీ వీధి దీపాలను మెసర్జ్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు అప్పగింత, వీధి కుక్కలకు స్టెరిలైజేషన, ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. 

 టీడీపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన

 నగర వాసులపై చెత్తపన్ను భారం మోపవద్దని టీడీపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి ముందు జీఎంసీ ఎదుట పుష్‌కాట్‌ నెట్టుకుంటూ ప్తకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం జీఎంసీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో కోవెలమూడి రవీంద్ర(నాని), కొమ్మినేని కోటేశ్వరరావు, యల్లావుల అశోక్‌యాదవ్‌, ఈరంటి వరప్రసాద్‌, నూకవరపు బాలాజి, మానం పద్మశ్రీ, ముప్పవరపు భారతి, తేలుకుట్ల హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు. 

 నేను కార్పొరేటర్‌నా కాదా..

 నేను కార్పొరేటర్‌నా కాదా...  ఫోన చేస్తే డీఈ, ఏఈలు కనీసం స్పందించడం లేదు.. వార్డు ప్రజలకు కనీసం నీళ్ల ట్యాంకర్‌ కూడా తెప్పించుకోలేని దుస్థితిలో ఉన్నానంటూ టీడీపీ కార్పొరేటర్‌ నూకవరపు బాలాజి ఆవేదన చెందారు.  మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అధికారులు ఉండాలని కార్పొరేటర్లను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.  

 ఏకగ్రీవంగా కో ఆప్షన సభ్యుల ఎంపిక

 నగర పాలక సంస్థలో ఐదుగురు సభ్యులను కో ఆప్షన సభ్యులుగా ఎన్నుకున్నారు. పూనూరి నాగేశ్వరరావు, ఆలా సాంబశివరావు, వెంకట బాల త్రిపుర సుందరి, పీర్‌ మహమ్మద్‌, సజలా భానును ఎన్నిక చేశారు. వీరితో మేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.  

Updated Date - 2021-08-28T05:28:47+05:30 IST