కరోనా ..... 127

ABN , First Publish Date - 2021-08-27T05:42:27+05:30 IST

జిల్లాలో గురువారం కొత్తగా 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనా ..... 127
మంచాల పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది

 పాజిటివ్‌ శాతం సగటున రెండు

రేపు జిల్లాలో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

గ్రామ సచివాలయాల్లో టీకాలు


గుంటూరు (మెడికల్‌): జిల్లాలో గురువారం కొత్తగా 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొద్ది వారాలుగా జిల్లాలో నిలకడగా నమోదవుతున్న కరోనా కేసులు సగటున రోజుకు వందకు తగ్గడం లేదు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకొనే వారిలో సగటున అటూ ఇటుగా రెండు శాతం పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా జిల్లాలో పాజిటివ్‌ శాతం సుమారు రెండుగా నమోదైంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 8,519 నమూనాలు సేకరించగా, ఇందులో 6,207 నమూనాల ఫలితాలను గురువారం ప్రకటించారు. 127 మందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ కాగా, 6080 మందికి నెగెటివ్‌ రిజల్ట్‌ వచ్చింది. మరో 2,312 మందికి సంబంధించిన నమూనాల ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో 36 కొవిడ్‌ ఆసుపత్రులు పనిచేస్తుండగా, వీటిలో 3,174 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 505 ఐసీయూ పడకలు, 1,711 నాన్‌ ఐసీయూ ఆక్సిజన్‌ బెడ్స్‌, 958 సాధారణ పడకలు ఉన్నాయి. 309 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం 486 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. 2,688 పడకలు ఖాళీగా ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం జిల్లాలో గురువారం నమోదైన కొవిడ్‌ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి... గుంటూరు డివిజన్‌ పరిధిలోని అమరావతిలో 6, గుంటూరు రూరల్‌లో 1, మంగళగిరిలో 6, మేడికొండూరులో 2, పెదకాకానిలో 1, తాడేపల్లిలో 6, గుంటూరు నగర పరిధిలో 31 కేసులు నమోదయ్యాయి. గురజాల డివిజన్‌ పరిఽధిలో దాచేపల్లిలో 2, గురజాలలో 1, కారంపూడిలో 2, మాచర్లలో 1, పిడుగురాళ్లలో 4, వెల్తుర్ధిలో 1 కేసు నమోదయ్యాయి. నరసరావుపేట డివిజన్‌ పరిధిలో చిలకలూరిపేటలో 5, ఈపూరులో 1, నాదెండ్లలో 6, నరసరావుపేటలో 13, నకరికళ్లులో 1, రొంపిచర్లలో 3, శావల్యాపురంలో 1, వినుకొండలో 2 కేసులు వెలుగు చూశాయి. తెనాలి డివిజన్‌ పరిధిలో అమృతలూరులో 1, బాపట్లలో 4, చేబ్రోలులో 2, కొల్లిపరలో 1, నిజాంపట్నంలో 3, రేపల్లెలో 3, తెనాలిలో 7, వేమూరులో 1 కేసు నమోదయ్యాయి.  చేబ్రోలు మండలం మంచాల ప్రాధమికోన్నత పాఠశాలలో కొందరు విద్యార్థులు జ్వరలక్షణాలతో బాధపడుతుండగా.. గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. 


రేపు మెగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌...

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో ఈనెల 28వ తేదీ శనివారం లక్షన్నర డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా జిల్లాలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి ప్రత్యేకంగా సచివాలయాల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ జరుగుతుందని ఆమె వివరించారు. ఇందుకోసం ప్రతి సచివాలయ ఏఎన్‌ఎం తమ పరిధిలోని 18-44 ఏళ్ల వయస్సు గల వారిని గుర్తించాలని ఆమె సూచించారు. ఈ మెగాడ్రైవ్‌లో అన్ని పట్టణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ, మెప్మా, డ్వామా, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకొని కార్యక్రమం విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ వెల్లడించారు.  

Updated Date - 2021-08-27T05:42:27+05:30 IST