రైతు వ్యతిరేకి జగన్‌

ABN , First Publish Date - 2021-01-21T04:56:08+05:30 IST

రాష్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి రైతుల సంక్షేమం పట్టదని ఏపీసీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ తెలిపారు.

రైతు వ్యతిరేకి జగన్‌
సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

తుపానుతో నష్టపోతే పట్టించుకోని ప్రభుత్వం  

కార్యకర్తల సమావేశంలో ఏపీసీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ 

తెనాలిటౌన్‌, జనవరి 20: రాష్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉందని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి రైతుల సంక్షేమం పట్టదని ఏపీసీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ తెలిపారు. స్థానిక మారీస్‌పేటలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన తెనాలి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ర్టాన్ని, ప్రజలను కేంద్రం వద్ద తాకట్టుపెట్టి సొంత పనులను చక్కదిద్దుకుంటున్నారని ఆరోపించారు. డెల్టా ప్రాంతంలో మూడు సార్లు రైతులు తుపాను ప్రభావంతో నష్టపోతే పట్టించుకున్న దిక్కే లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతుల మెడకు ఉరి తాళ్లుగా వేస్తే జగన్‌రెడ్డి ప్రభుత్వం వాటికి మద్దతివ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేంద్రం చేతిలో సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సీఐడీ ఉన్నా ఇంతవరకు దేవాయాల్లో విగ్రహాల ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయకపోవడంలో గుట్టు ఏమిటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చే పనిలో భాగంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు. పార్టీలో పదవులు పొంది, కష్టకాలంలో పార్టీని, ప్రజలను మోసం చేసిన నాయకులను నడిబజార్లో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నాయకత్వ లక్షణాలను పెంచేందుకు తెనాలి కేంద్రంగా త్వరలో ఐదు జిల్లాల కార్యకర్తలకు శిక్షణ పాఠశాల నిర్వహించనున్నట్లు చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలను అమ్మేసే కార్యక్రమానికి మోదీ శ్రీకారం చుట్టారన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను మోదీ అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌వలి మాట్లాడుతూ జగన్‌ మోదీ జేబులో మనిషిగా మారిపోయాడన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు, నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చందు సాంబశివుడు, నాయకులు పొన్నూరు శశి, సలీం, తాడిక వెంకటేశ్వరరావు, శోభన్‌కుమర్‌, జక్కా శ్రీనివాసరావు, రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T04:56:08+05:30 IST