వరద సహాయక చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-11-23T06:01:09+05:30 IST

జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలుచేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు.

వరద సహాయక చర్యలు చేపట్టాలి
వరద పరిస్థితిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌

గుంటూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన సహాయక చర్యలుచేపట్టాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో అల్పపీడన ప్రభావంతో గత కొద్దిరోజుల నుంచి నిత్యం కురుస్తున్న వర్షాలపై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. వ్యవసాయం, పశుసంవర్థక, ఉద్యాన, జలవనరులు, ఆర్‌ అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జడ్పీ, మునిసిపల్‌, పంచాయితీశాఖల అధికారులతో వర్షాల వల్ల వాటిల్లిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

మరికొన్ని రోజులు భారీ వర్షాలు..

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వాతావరణ శాఖ జారీచేసిన నివేదిక ప్రకారం జిల్లాలో భారీవర్షాలు మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. వర్షాలవల్ల గ్రామాల్లోని పంచాయతీ, ఇరిగేషన్‌ చెరువులకు గండ్లు పడకుండా రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్‌, పంచాయతీశాఖల అధికారులతో జాయింట్‌ కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. నష్టం జరిగిన పంటలను లెక్కించి నివేదిక రూపొందించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయమందించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, విపత్తుల నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. తుపాను పునరావాసకేంద్రాల్లో మౌలికసౌకర్యాలను కల్పించి సిద్ధంగా ఉంచాలన్నారు. ఆయాశాఖలకు సంబంధించి అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, డీఆర్‌వో కొండయ్య, జడ్పీ సీఈవో ఛైతన్య, డీపీవో కేశవరెడ్డి, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, ఉద్యాన శాఖ డీడీ సుజాత, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, ఇరిగేషన్‌ డిప్యూటీ ఎస్‌ఈ మల్లికార్జునరావు, హ్యాండ్లూమ్స్‌ ఏడీ వనజ పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-23T06:01:09+05:30 IST