గణతంత్ర దిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-17T05:23:53+05:30 IST

పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ నెల 26న జరిగే గణతంత్ర దిన వేడుకలకు విస్త్రృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

గణతంత్ర దిన వేడుకలకు విస్తృత ఏర్పాట్లు
కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌, జేసీలు

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశం

గుంటూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ నెల 26న జరిగే గణతంత్ర దిన వేడుకలకు విస్త్రృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో వేడుకల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విశ్లేషిస్తూ శకటాలు ఏర్పాటు చేయాలన్నారు. హౌసింగ్‌, వైఎస్‌ఆర్‌ జలకళ, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, అమూల్‌ ప్రాజెక్టు, ఫ్రీ డెలివరీ ఆఫ్‌ రైస్‌, మనం - మన పరిశుభ్రత, స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాలపై శకటాలు ఆకట్టుకొనేలా తీర్చిదిద్దాలన్నారు. సేంద్రియ వ్యవసాయ, మత్స్య సంపద యోజన, ఓటర్ల దినోత్సవం, వృత్తి నైపుణ్యంతో పాటు ఐసీడీఎస్‌, డీఆర్‌డీఏలో అమలు చేస్తోన్న పథకాలపై స్టాల్స్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేయాలని సూచించారు. పతాకావిష్కరణ, పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో అలంకరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకి సూచించారు. సాంస్కృతిక ప్రదర్శనలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డీఈవోని ఆదేశించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విశిష్ట సేవలు అందించిన వారికి, పేదలందరికీ ఇంటి పథకం పట్టాల పంపిణీకి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులు, వివిధ సంక్షేమ పథకాల అమలుకు కృషి చేసినవారికి మెరిట్‌ సర్టిఫికెట్లు అందించేందుకు జాబితాలను సిద్ధం చేయాలన్నారు. పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులను వారి ఇంటి వద్దే సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికారులు ఘనంగా సన్మానించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు. 


18కల్లా ఎండీయూ వాహనాల రిజిస్ట్రేషన్‌ పూర్తికావాలి


జిల్లాలో ఇంటింటికి రేషన్‌ సరుకులు పంపిణీ చేసే మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయు) వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో పౌరసరఫరాలు, రెవెన్యూ, రవాణాశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు మొత్తం 899 వాహనాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న సీఎం జగన్‌ ఇంటింటికి రేషన్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు. దీని దృష్ట్యా వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం పూర్తి కావాలన్నారు. 22, 23 తేదీల్లో మండలాల వారీగా కేటాయించిన వాహనాలతో ఇంటింటికి రేషన్‌ సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ పరిశీస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటి వద్దకే సరుకులు తీసుకెళ్లి అందించాలన్నారు.  సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పి.ప్రశాంతి, కె.శ్రీధర్‌రెడ్డి, డీఆర్వో సి. చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈవో చైతన్య, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి, డీపీవో కొండయ్య, డీటీసీ మీరాప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:23:53+05:30 IST