జిల్లాకు అరకొర!

ABN , First Publish Date - 2021-05-21T04:55:53+05:30 IST

2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన పద్దులో జిల్లాకు అన్యాయం జరిగింది.

జిల్లాకు అరకొర!

రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రం

గుంటూరు కార్పొరేషన్‌ యూజీడీకి రూ. 20 కోట్లు

మంగళగిరిలో అభివృద్ధి పనులకు మరో రూ. 20 కోట్లు

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి రూ. 100 కోట్లు


గుంటూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన పద్దులో జిల్లాకు అన్యాయం జరిగింది. అరొకర కేటాయింపులు తప్పా పెద్దగా ఏమి లేవనే ఆర్థికవేత్తలు చెబుతోన్నారు. నిజాంపట్నం పోర్టు విస్తరణ గురించి అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. పల్నాడు, బాపట్లలో శంకుస్థాపన చేసిన మెడికల్‌ కళాశాలలకు నామమాత్రంగానే కేటాయింపులు జరిపారు. భారీ ప్రాజెక్టు అయిన అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి సంబంధించి అన్ని జిల్లాలకు కలిపి మొక్కుబడిగా రూ. 100 కోట్లు కేటాయించారు. జలవనరుల ప్రాజెక్టులకు కూడా ఆశించినంతగా నిధులు కేటాయించలేదు. ఇక నిర్మాణదశలో ఉన్న వాటికి చాలా తక్కువగా నిధులు ప్రతిపాదించారు. సీఎం జగన్‌ జిల్లాలోని తాడేపల్లిలోనే ఉంటోన్నప్పటికీ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. 


రాయలసీమ ప్రాంతాన్ని అమరావతితో అనుసంధానం చేసే అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగాస్వామ్యంతో చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం పెద్దగా చొరవ చూపించలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో కేవలం రూ. 100 కోట్లు మాత్రమే కేటాయించింది. గుంటూరు నగరంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకా కేవలం రూ. 20 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రరూ. 903.82 కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. కేంద్ర ప్రభుత్వం రూ. 540 కోట్లు ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడం వలన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఏడాదైనా భారీగా కేటాయింపులు జరుపుతారని భావిస్తే రూ. 20 కోట్లతో సరి పెట్టారు. ఇదే విధంగా మంగళగిరి - తాడేపల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారని భావించారు. దానికి కూడా రూ. 20 కోట్లతో సరిపెట్టారు. 

కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ. 522.80 కోట్లు కేటాయించారు. అయితే ఈ నిధులను గుంటూరు, కృష్ణ, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో వెచ్చిస్తారు. జిల్లాకు ఎంత కేటాయింపు జరిపారనే దానిపై స్పష్టత కొరవడదింది. అలానే గుంటూరు, కృష్ణా జిల్లాలకు కలిపి డ్రైనేజీ అభివృద్ధికి రూ. 19.56 కోట్లు కేటాయించారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువున రెండు ఆనకట్టలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటికి నిధులు కేటాయింపు జోలికి వెళ్లలేదు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పల్నాడు కరువు దుర్భిక్ష ప్రాజెక్టుని కూడా బడ్జెట్‌లో చూపించలేదు. ఈ ప్రాజెక్టుకి రూ. 2,746 కోట్ల నిధులు అవసరమౌతాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ చర్చించి ఆమోదించారు. ఈ ప్రాజెక్టుకి అవసరమైన నిధులను ఫైనాన్సా సంస్థల నుంచి రుణం రూపంలో సమకూర్చకోవాలి. బడ్జెట్‌లో అసలు దీని ప్రస్తావనే లేదు. వైకుంఠపురం, బొల్లాపల్లి రిజర్వాయర్‌ గురించి కూడా బడ్జెట్‌లో పేర్కొనలేదు. గుంటూరు ఛానల్‌ పొడిగింపు, ఆధునికీకరణ, నల్లమడ డ్రెయిన్‌ మోడర్‌నైజేషన్‌లకు కూడా ఇక శుభం కార్డు పడినట్లేనన్న భావన బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే స్పష్టమౌతోన్నది. 


అమరావతి రాజఽధానిలో రైతులకు కౌలు ఇచ్చేందుకు రూ. 195 కోట్లు కేటాయించారు. భూమి లేని నిరుపేదలకు నెలకు ఇస్తోన్న రూ. 2,500ల నుంచి రూ. 5 వేల పింఛన్‌ ఇంచ్చేందుకు ఆమోదం తెలిపారు. అమరావతిలో సైన్స్‌ సిటీ నిర్మాణానికి రూ. 6.98 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. అమరావతి రాజధాని అభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో చూపించలేదు. కొత్త రాజధాని భూసేకరణ, అభివృద్ధి కోసం మాత్రం రూ. 695 కోట్లు వరకు కేటాయింపుల్లో చూపించారు. అమరావతి మెట్రో రైల్‌ ప్రాజెక్టుకి కేవలం రూ. 3.60 కోట్లు కేటాయించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొంటే అమరావతి రాజధాని అనేది లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోన్నట్లుగా స్పష్టమౌతోన్నది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న మెడికల్‌ కళాశాలలన్నింటికి కలిపి రూ. 250 కోట్లు కేటాయించారు. అందులో జిల్లాకు కనీసం రూ. 10 కోట్లు అయినా వస్తాయో, రాదోనన్న సందేహాలు కలుగుతోన్నాయి. రైతుభరోస ద్వారా 4.50 లక్షల మంది రైతులు, అమ్మఒడి పథకం ద్వారా 4.25 లక్షల మంది తల్లులకు ఈ ఏడాది కూడా ఆర్థికసాయం చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. 


Updated Date - 2021-05-21T04:55:53+05:30 IST