బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దళారుల బెడద

ABN , First Publish Date - 2021-12-26T05:56:41+05:30 IST

జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులను దళారులు మఽభ్యపెడుతోన్నారు.

బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దళారుల బెడద

రూ. 5 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రలోభాలు

అధికార పార్టీ నేతల లేఖలు తెచ్చుకొంటోన్న అభ్యర్థులు

నెలాఖరున మెరిట్‌ జాబితా విడుదల కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ

గుంటూరు, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్‌సీ, ఎస్‌టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులను దళారులు మఽభ్యపెడుతోన్నారు. ఈ పోస్టులు పూర్తిగా మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేసేవి అయినప్పటికీ తాము సిఫార్సు చేసి ఇప్పిస్తామని రూ. లక్షల్లో నగదు డిమాండ్‌ చేస్తోన్నారు. కొంతమంది అమాయకులు ఇప్పటికే వారి మాటలు నమ్మి రూ. లక్షల్లో చెల్లించినట్లు సమాచారం. దాంతో వారంతా తమకు ఉద్యోగం వచ్చినట్లేనన్న భావనలో ఉన్నారు. కాగా ఈ నెల 31వ తేదీన ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టుని జిల్లా యంత్రాంగం విడుదల చేయబోతోన్నది. విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ జాబితాని విడుదల చేస్తారు. దీంతో అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్నారు. 

ఏటా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పడిన ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వుడ్‌ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ నియామక ప్రక్రియని పర్యవేక్షిస్తుంది. ఈ దఫా మొత్తం 43 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌-4, జూనియర్‌ స్టెనో - 2, టైపిస్టు-2, ఆఫీసు సబార్డినేట్‌-20, వాటర్‌మెన్‌-1, స్వీపర్‌-6, వాచ్‌మెన్‌-6, ఫిషర్‌మెన్‌-2 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎస్‌సీ జనరల్‌-12, ఎస్‌సీ-మహిళలకు 15 రిజర్వు చేశారు. అలానే ఎస్‌టీ జనరల్‌-7, ఎస్‌టీ మహిళలు-9 రిజర్వు చేశారు. పోస్టుని బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. ఈ నెల 2వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడగా 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల రిజిసే్ట్రషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీతో రిజిసే్ట్రషన్‌ ప్రక్రియ ముగిసింది. ఈ నెల 31వ తేదీన ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టుని ప్రచురించాల్సి ఉన్నది. దీనిపై జనవరి 1 నుంచి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల మధ్యన అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 21వ తేదీన అభ్యంతరాలను పరిష్కరిస్తారు. ఆ తర్వాత 22న తుది మెరిట్‌ లిస్టుని విడుదల చేస్తారు. 28న ఒరిజినల్‌ సర్టిఫికేట్ల పరిశీలన, వరిఇ్చ 4వ తేదీన ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహించి ఆ నెల 8వ తేదీన జిల్లా కలెక్టర్‌ ఎలాట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇస్తారు. 9వ తేదీన సంబంధిత డిపార్టుమెంట్‌లు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇస్తాయి. 

బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ ఎలాంటి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోరాదన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది అధికార పార్టీ నేతలను ఆశ్రయించి వారి వద్ద నుంచి సిఫార్సు లేఖలు తీసుకొని అవి ప్రభుత్వ కార్యాలయానికి చేరేలా వివిధ మార్గాలను అవలంభిస్తోన్నారు. కొందరైతే రూ. 5 లక్షలు చెల్లించి సిఫార్సు లేఖ తెచ్చుకొన్నట్లు తెలిసింది. కాగా కొంతమంది నేతలు ఈ పోస్టులు తాము సిఫార్సు చేసిన వారికే ఇస్తారన్న భ్రమల్లో ఉంటూ వారి వద్దకు వచ్చే వారిని కూడా భ్రమింప చేస్తోన్నారు. మెరిట్‌లిస్టులో ఏమాత్రం తేడాలు జరిగినా అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయిస్తారు. అక్కడ అధికారుల తప్పిదం ఉందని తేలితే వారి ఉద్యోగాలకే ముప్పు వాటిల్లుతుంది. దీంతో వారి పరిస్థితి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది. 


Updated Date - 2021-12-26T05:56:41+05:30 IST