దారి దోపిడీ.. నగదు, ఆభరణాలు అపహరణ

ABN , First Publish Date - 2021-12-08T05:28:46+05:30 IST

ద్విచక్రవాహనాలపై వెళుతున్న దంపతులను దారికాచి దాడిచేసి వారివద్దనున్న నగదు, బంగారు నగలను దోచుకున్న ఘటన యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామపరిధిలో చోటుచేసుకుంది.

దారి దోపిడీ.. నగదు, ఆభరణాలు అపహరణ
దుండగుల దాడిలో గాయపడిన బాధితులు

యడ్లపాడు, డిసెంబరు 7: ద్విచక్రవాహనాలపై వెళుతున్న దంపతులను దారికాచి దాడిచేసి వారివద్దనున్న నగదు, బంగారు నగలను దోచుకున్న ఘటన యడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగారావుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మద్దు వీరయ్య, ప్రసన్న దంపతులు సోమవారం గుంటూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రాత్రి 9.30గంటల సమయంలో బోయపాలెం నుంచి లింగారావుపాలెం మార్గంలో గల చెరువు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని యువకులు కర్రలతో దాడి చేశారు. దీంతో ఇద్దరూ కింద పడిపోయారు. వారిని పక్కనే ఉన్న పొలంలోకి లాక్కెళ్లి వీరయ్యను కొట్టి అతని భార్య చెవులకు ఉన్న సుమారు 3.5గ్రాముల జూకాలు, రూ.2,300 నగదు, సెల్‌ఫోన్‌ను లాక్కుని పంపించి వేశారు. మరికొద్ది సేపటికి అదేమార్గంలో అదే కాలనీకి చెందిన మద్దు అంకమ్మ, నర్సమ్మ దంపతులపై కూడా దాడిచేసి వారి వద్ద ఉన్న చెవి కమ్మలు, జూకాలు, సెల్‌ఫోన్‌తోపాటు మెడలోని గొలుసును లాగేశారు.  ఈ దాడిలో అంకమ్మ తలకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యడ్లపాడు ఎస్‌ఐ రాంబాబు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీఎస్‌ పోలీసులు సంఘటన స్థలంలో డాగ్‌స్వ్కాడ్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. 


Updated Date - 2021-12-08T05:28:46+05:30 IST