దొంగతనాలకు పాల్పడుతున్న యువకుల అరెస్టు

ABN , First Publish Date - 2021-11-23T06:19:06+05:30 IST

చెడు వ్యసనాలకు బానిసలైన ఇద్దరు యువకులు చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.

దొంగతనాలకు పాల్పడుతున్న యువకుల అరెస్టు
నిందితులను అరెస్టుచేసి వారి వద్ద స్వాధీనం చేసుకున్న సామగ్రి

ఆటోనగర్‌లో ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం

డయల్‌ 100 కాల్‌తో నిందితులను పట్టుకున్న పోలీసులు

పెదకాకాని, నవంబరు 22: చెడు వ్యసనాలకు బానిసలైన ఇద్దరు యువకులు చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.  గుంటూరులో ద్విచక్ర వాహనాన్ని దొంగలించగా, ఆటోనగర్‌లో ఏటీఎం మిషన్‌ను పగలకొట్టి దొంగతనానికి యత్నించే క్రమంలో పెదకాకాని పోలీసులకు పట్టుబడిన ఇద్దరు దొంగల వ్యవహారాన్ని సోమవారం పెదకాకాని సీఐ బండారు సురేష్‌బాబు మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన కఽథనం ప్రకారం.. గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో కోడిగుడ్ల సత్రం వెనుక రోడ్డులో షేక్‌ అబ్దుల్‌ రజాక్‌, పఠాన్‌ రహీంలు అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వీరు గుంటూరు మాయాబజార్‌లో పాత వాహనాలను పగలకొట్టే పనిచేస్తూ జీవిస్తున్నారు. కొంతకాలంగా మద్యం, చెడు వ్యసనాలకు బానిసలైన వీరు దొంగతనాలకుపాల్పడుతున్నారు. పొత్తూరివారితోటలో ఇంటి ముందు పెట్టి ఉన్న ఏపీ 16 సీఎఫ్‌ 0050 నెంబర్‌ గల ద్విచక్ర వాహనాన్ని దొంగలించారు. చోరీకి పాల్పడిన అనంతరం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆటోనగర్‌100 అడుగుల రోడ్డులో గల ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించారు.  తమతో తెచ్చుకున్న సుత్తి, ఇనుపరాడ్డు, శ్రావణంతో వారు ఏటీఎం మిషన్‌ను పగలకొడుతున్న సమయంలో గమనించిన స్థానికులు డయల్‌ 100కు సమాచారం అందించారు. దీంతో పెదకాకాని ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ హుటాహుటిన  ఘటనాస్థలానికి చేరుకుని రజాక్‌, రహీంలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఘటన స్థలంలో అరెస్టు చేసిన ఎస్‌ఐ వినోద్‌కుమార్‌, కానిస్టేబుళ్లు సాగర్‌బాబు, అంకమ్మరావు, వీరభద్రరావు, శ్రీధర్‌, హోంగార్డు ఎస్‌.కుమార్‌, చోరీ యత్నాన్ని పట్టించిన ఎస్‌ఐ తమ్ముడైన వినయ్‌కుమార్‌, వాచ్‌మన్‌ రమేష్‌లను పెదకాకాని సీఐ సురేష్‌బాబు చేతుల మీదగా క్యాష్‌ రివార్డును అందజేశారు. నిందితులను అరెస్టుచేసి కోర్టుకు హాజరుపరచినట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2021-11-23T06:19:06+05:30 IST