చోరీకేసులో నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2021-10-19T05:47:52+05:30 IST

రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో తాళంవేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్టుచేశారు.

చోరీకేసులో నలుగురి అరెస్టు
స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు పరిశీలిస్తున్న అర్బన ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్‌, అదనపు ఎస్పీ గంగాధరం

నిందితుల్లో కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ

మరో ఐదు కేసుల్లో వీడిన మిస్టరీ

గుంటూరు, అక్టోబరు18: రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో తాళంవేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్టుచేశారు. ఈ ముఠా నుంచి చోరీకి గురైన 688 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థుడైన విజయవాడ చిట్టినగర్‌కు చెందిన కొర్రపాటి వీరనాగరాజు అలియాస్‌ విజయ్‌ అలియాస్‌ వంశీ అలియాస్‌ విజయరాజు అలియాస్‌ నానితోపాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్‌కు చెందిన గంజా వెంకన్న, ప్రకాశం జిల్ల సంతనూతలపాడుమండలం బొడ్డువారిపాలేనికి చెందిన బాలినేని కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురానికి చెందిన పాలుకూరి నారాయణ తదితరులు ఉన్నారు. ఈమేరకు సోమవారం పోలీసు కార్యాలయంలో అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. ఉండవల్లికి చెందిన జొన్నా దినేష్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో కొన్ని నెలలుగా  ఇక్కడే వర్క్‌ ఫ్రంహోం చేస్తున్నాడు. ఈనెల 2న ఇంటికి తాళం వేసి గుంటూరులోని తన అత్త ఇంట్లో ఉంటున్న భార్య, పిల్లలను చూసేందుకు వెళ్లాడు. అదేరోజు రాత్రి దొంగలు ఇంటితాళం పగులగొట్టి బీరువాలోని 688 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. ఎదురింట్లో ఉన్న సీసీ కెమెరాలను పగులగొట్టి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డారు. అయితే 3న ఇంటికివెళ్లి చోరీ విషయం గుర్తించిన దినేష్‌ తాడేపల్లి స్టేషనలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. దీనిపై అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ ఆదేశాల మేరకు నార్త్‌ డీఎస్పీ జె.రాంబాబు ఆధ్వర్యంలో తాడేపల్లి సీఐ శేషగిరిరావు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. చోరీ చేసిన రూ.15 లక్షల ఖరీదైన బంగారు ఆభరణాలను నాగరాజు, వెంకన్న, కృష్ణారెడ్డిలు ప్రకాశం బ్యారేజ్‌ వద్దకు నారాయణను పిలిపించి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు దాడిచేసి నలుగురిని అరెస్టుచేసి  బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

  

Updated Date - 2021-10-19T05:47:52+05:30 IST