దళిత బాలికపై అత్యాచారం కేసులో.. నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2021-08-21T04:46:03+05:30 IST

రాజుపాలెంలో గల పులిచింతల పునరావాసం కేంద్రం ఆర్‌ఆర్‌ కాలనీలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు గళ్లా లాబాన(32)ను అరెస్టు చేసినట్టు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు.

దళిత బాలికపై అత్యాచారం కేసులో.. నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, పక్కన డీఎస్పీ రవిచంద్ర, వెనుక నిందితుడు

మరో నిందితుడు పాత్రపై దర్యాప్తు

డీఎనఏ పరీక్ష అనంతరం నిర్ధారణ

రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ 

గుంటూరు, ఆగస్టు 20:  రాజుపాలెంలో గల పులిచింతల పునరావాసం కేంద్రం ఆర్‌ఆర్‌ కాలనీలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు గళ్లా లాబాన(32)ను అరెస్టు చేసినట్టు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. శుక్రవారం గుంటూరులోని పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. 17 సంవత్సరాల బాధితురాలు ఆర్‌ఆర్‌ సెంటరులోని తన నాయనమ్మ, అమ్మమ్మ ఇళ్లవద్దకు వెళ్లి వస్తతందన్నారు. ఆమె చిన్నతనం నుంచే మానసిక దివ్యాంగురాలు.   ఈనెల 18న మధ్యాహ్నం బాధితురాలు సమీపంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా కారు డ్రైవర్‌గా పనిచేసే లాబాన బాధితురాలిని ఇంట్లోకి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. అదే సమయంలో లాబాన స్నేహితుడైన మరోడ్రైవర్‌ సంజీవకుమార్‌ వచ్చి తలుపు కొట్టగా తాను తర్వాత వస్తానని చెప్పటంతో అతను అక్కడినుంచి తిరిగి వెళ్లిపోయాడన్నారు. బాధితురాలు మైనర్‌ కావటంతో ఆమె భవిష్యత దృష్ట్యా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబసభ్యులు  వెనుకాడారన్నారు. విషయం తమ దృష్టికి రావటంతో దిశస్టేషన డీఎస్పీ యు.రవిచంద్ర, సత్తెనపల్లి డీఎస్పీ ఆర్‌.విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల రూరల్‌ సీఐ పీవీ ఆంజనేయులు, రాజుపాలెం ఎస్‌ఐ అమీర్‌ తదితరులు దిశ మహిళా సిబ్బందిని, మహిళా పోలీసులను పంపి జరిగిన ఘటనపై బాధితురాలిని విచారించటంతోపాటు కుటుంబ సభ్యులకు కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చి గురువారం ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. వెంటనే నిందితుడు లాబానను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటనలో రెండో నిందితుడు సంజీవకుమార్‌ పాత్రపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లాబానతోపాటు సంజీవకుమార్‌లకు కూడా డీఎనఏ పరీక్షలు చేస్తున్నామన్నారు.  ఇదిలావుంటే బాధితురాలు లాబానకు దూరపు బంధువు అవుతుందని ఎస్పీ తెలిపారు.  15 రోజుల క్రితం కూడా ఒకసారి బాధితురాలిపై అత్యాచారం చేసేందుకు లాబాన ప్రయత్నించినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. బాధితురాలికి జీజీహెచలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం బయటకు వస్తే ఆ కుటుంబానికి ఎంతో బాధకలుగుతుందని, సున్నిత అంశాల్లో రాజకీయాలు చేయటం మంచిదికాదని ప్రతిపక్షాలకు సూచించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పిడుగురాళ్ల రూరల్‌ సీఐ ఆంజనేయులు, రాజుపాలెం ఎస్‌ఐ అమీర్‌, సిబ్బందిని రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ అభినందించారు.


Updated Date - 2021-08-21T04:46:03+05:30 IST