పథకం ప్రకారమే టీడీపీ నేత అంకులు హత్య

ABN , First Publish Date - 2021-01-21T05:27:32+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన టీడీపీ నేత పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేశారు.

పథకం ప్రకారమే టీడీపీ నేత అంకులు హత్య
వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ, పక్కన గరజాల డిఎస్పీ జయరామ్‌ప్రసాద్‌, సీఐ ఉమేష్‌

అత్యంత సన్నిహితుడితో కలసి వైసీపీ నేత కుట్ర

గ్రామంలో ఆధిపత్యం, పాతకక్షలే కారణం

మత్తుమందు ఇచ్చి గొంతు కోసి హతమార్చారు

జనశక్తి మాజీ నక్సల్స్‌తో సుపారీ

ఆరుగురు నిందితుల అరెస్టు

గుంటూరు, జనవరి 20: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన టీడీపీ నేత పురంశెట్టి అంకులును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేశారు. పాతకక్షలకు తోడు గ్రామంలో ఆధిపత్యం చెలాయించేందుకు వైసీపీ నేత కుట్ర పన్నాడు. ఇందులో అంకులుకు అత్యంత సన్నిహితుడు కీలకంగా మారాడు. ఆస్తివివాదంలో అంకులుపై వ్యక్తిగత కక్షపెంచుకున్న వ్యక్తి కూడా జతకలిశాడు. ఈ ముగ్గురు కలసి జనశక్తినేతలతో కలసి అంకులు హత్యకు సుపారీ (కిరాయి) మాట్లాడారు. అంకులు హత్య కేసులో పెదగార్లపాడుకు చెందిన వైసీపీ నేత కర్పూరపు వెంకట కోటయ్య, గుర్రం వెంకటేశ్వరరెడ్డి, అంకులుకు అత్యంత సన్నిహితుడైన అదే గ్రామానికి చెందిన మేకల చినకోటేశ్వరరావు, జనశక్తి గ్రూపు మాజీ నక్సల్స్‌ కేశానుపల్లికి చెందిన పొట్టసిరి చినశంకరరావు అలియాస్‌ శివరామ్‌, అతని తమ్ముడు పొట్టసిరి అంకారావు, వారి బంధువు నకరికల్లు మండలం రూపెనగుంట్లకు చెందిన అద్దంకి రమేష్‌లను నిందితులుగా గుర్తించి అరెస్టుచేసినట్లు రూరల్‌ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. బుధవారం పోలీస్‌ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు... పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులు మొదటినుంచి నక్సల్స్‌ గ్రూపు జనశక్తికి సానుభూతిపరుడు. అతనికి గతంలో జనశక్తిలో పనిచేసిన మేకల చిన కోటేశ్వరరావు ఎన్నోఏళ్లుగా సన్నిహితుడు. గ్రామానికి చెందిన కర్పూరపు వెంకట కోటయ్య కూడా గతంలో జనశక్తిలో పనిచేశాడు. ఈ క్రమంలో 1995 నుంచే అంకులుతో ఆయనకు విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పెదగార్లపాడులో వైసీపీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. అంకులుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నప్పటికీ తనను ఆర్థికంగా ఆదుకోలేదని, తనకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని అంకులే చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాక్టరీకి అమ్ముకొని తనను మోసం చేసినట్లు చినకోటేశ్వరరావు అంకులుపై కక్ష పెంచుకున్నాడు. దీనికితోడు గత పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామసర్పంచ్‌ ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్‌ అయినప్పటికీ తనను కాకుండా వేరొకరిని ఎంపికచేయడంతో అంకులుపై మరింత కసిని పెంచుకున్నాడు. ఇదిలాఉంటే గ్రామానికి చెందిన కర్పూరపు వెంకట కోటయ్యపై గత మే నెలలో చెట్టినాడు సిమెంట్‌ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులు దాడిచేశారు. దీనికి కారణం అంకులేనని కోటయ్య భావించాడు. గతంలో ఓ ఘటనలో వెంకట కోటయ్య, అంకులు కలసి పాల్గొన్నప్పటికీ అందులో అంకులు పేరు లేకుండా చినకోటయ్య పేరే మాత్రమే ఉండటం, ఆ కేసులో అతనికి శిక్ష పడటంతో అంకులుపై ఆయన మరింత కోపం పెంచుకున్నాడు. గ్రామంలోనూ రాజకీయంగా ప్రత్యర్థిగా ఉన్నాడు. ఇదిలావుంటే చెట్టినాడు ఫ్యాక్టరీలో నీపై దాడి చేయించింది అంకులేనని, ఎప్పటికైనా నిన్ను అంకులు చంపుతాడని  వెంకట కోటయ్యకు చిన కోటేశ్వరరావు చెప్పాడు. దీంతో ఎలాగైనా అంకులును చంపాలని వీరిద్దరు నిర్ణయించుకున్నారు. అంకులును జనశక్తి మాజీ నేతలలైతే చంపగలరని, అందుకు తన వద్ద ఉపాయం ఉందని కూడా చిన కోటేశ్వరరావు చెప్పాడు. జనశక్తి మాజీ నాయకుడైన పొట్టసిరిచిన శంకరరావు ఆక్రమించిన 8ఎకరాల పొలానికి రికార్డులు పుట్టించేందుకు సహకరించడంతోపాటు కొంతమొత్తం డబ్బు ఇస్తే పనవుతుందని చిన కోటేశ్వరరావు చెప్పాడు. అయితే గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వరరెడ్డికి కుటుంబంలో నెలకున్న ఆస్తి వివాదంలో అంకులు సహకరించకపోవడంతో అంకులుపై ఆయన కూడా కోపంతో ఉన్నాడని ఈ హత్యకు వెంకటేశ్వరరెడ్డి కూడా ఆర్థిక సహకారం ఇస్తాడని చిన కోటేశ్వరరావు చెప్పాడు. ఇందుకు తాను రూ.5లక్షలు ఇస్తానని వెంకటేశ్వరరెడ్డి ముందుకువచ్చాడు. దీంతో వెంకట కోటయ్య, చిన కోటేశ్వరరావు, వెంకటేశ్వరెడ్డి ముగ్గురూ కలసి అంకులును హత్య చేయించాలని నిర్ణయించుకున్నారు. వీరు గతంలో జనశక్తిలో పనిచేసిన చిన శంకరరావు అలియాస్‌ శివరామ్‌ను సంప్రదించి అతను ఆక్రమించిన 8 ఎకరాల పొలానికి అతని పేరుతో పత్రాలు ఇప్పించి, రూ.15 లక్షలు నగదు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను అడ్వాన్స్‌గా రూ. 2.50 లక్షల నగదు ఇచ్చారు. దీంతో చిన శంకరరావు ఈ హత్యకు తన తమ్ముడైన అంకారావు, తన బంధువైన అద్దంకి రమేష్‌లతో కలసి పతకం వేశాడు.

డిసెంబరు 31న పథకం విఫలం...  


అంకులు ఎవరినీ నమ్మడు.. ఎవరు ఫోన్‌చేసినా రాడు... అయితే చిన కోటేశ్వరరావు పిలిస్తే మాత్రం తప్పకవస్తాడు... దీంతో చినకోటేశ్వరరావుతో అంకులుకు ఫోన్‌చేయించి పల్నాడులో కొత్త నక్సల్స్‌ పార్టీ వచ్చిందని, దీనికి సంబంధించి రిక్రూట్‌మెంట్‌ చేయడం, ఇతర విషయాలపై చర్చించుకుందామని డిసెంబరు 31న ఒకసారి పిలిచారు. అయితే ఆ రోజు అంకారావు రాకపోవడంతో హత్య పథకం వాయిదా వేసుకున్నారు. తిరిగి ఈ నెల3న మరోసారి చిన కోటేశ్వరరావుతో అంకులును పిలిపించారు. అంకులుకు విప్లవ పార్టీలంటే అభిమానం ఉండటంతో పాటు అత్యంత సన్నిహితుడు ఫోన్‌ చేయడంతో నమ్మి వెళ్ళాడు. 

పుల్కా కర్రీలో మత్తు కలిపి గొంతు కోసి హత్య


నక్సల్స్‌పార్టీ గురించి మాట్లాడుకునేందుకు దాచేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌కు అంకులు వెళ్ళాడు. అక్కడ పుల్కాకర్రీలో మత్తు బిళ్లలు పొడి చేసి చినశంకరరావు అందులో కలిపాడు. దానిని అంకులుకు, అంకారావుకు పెట్టగా ఈ విషయం ముందే తెలుసు కాబట్టి అంకారావు తినలేదు. అది తిన్న అంకులుకు మగత రావడంతో అనుమానం వచ్చి వెంటనే డ్రైవర్‌కు ఫోన్‌చేశాడు. అయితే తాను దూరంగా ఉన్నానని వస్తున్నానని డ్రైవర్‌ చెప్పాడు. ఇంతలో అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు అంకులు లేవగా ఇదే అదునుగా రమేష్‌కు అంకారావు సైగ చేశాడు. దీంతో రమేష్‌ టవల్‌తో అంకులు గొంతు బిగించి వెనక్కులాగి కింద పడేశాడు. చినశంకరరావు కాళ్ళు పట్టుకోగా, రమేష్‌ చేతులు పట్టుకున్నాడు. ముందుగా అంకారావు అంకులు గొంతు పిసికి ఆ తరువాత కత్తితో గొంతు కోశాడు. అంకులు మృతి చెందాక అక్కడ నుంచి నిందితులు ముత్యాలంపాడు రోడ్డులో నీటిగుంతలో కత్తిని పడేసి వెళ్ళిపోయారు. అంకులు హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురిపైనా గతంలో పలు కేసులు ఉన్నాయి.

అంకులు హత్యలో రాజకీయ కోణం లేదు


అంకులు హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తుచేసినట్లు రూరల్‌ జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ తెలిపారు. ఈ హత్యలో ఎటువంటి రాజకీయ కోణం లేదని తెలిపారు. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. ఇందుకుగాను గురజాల డీఎస్పీ బి.జయరామ్‌ప్రసాద్‌, గురజాల రూరల్‌, చిలకలూరిపేట రూరల్‌, నరసరావుపేట రూరల్‌, సత్తెనపల్లి రూరల్‌ సీఐలు ఉమేష్‌, సుబ్బారావు, అచ్చయ్య, నరసింహారావులతో కేసు దర్యాప్తు చేసినట్లు తెలిపారు. కాగా కేసులో ఆధారాలు సేకరించిన సీడీఆర్‌ వింగ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజకిశోర్‌కు రూరల్‌ ఎస్పీ రివార్డు అందించారు. విలేకరుల సమావేశంలో గురజాల డీఎస్పీ బి.జయరామ్‌ప్రసాద్‌,  గురజాల రూరల్‌ సీఐ ఉమేష్‌, ఎస్‌ఐ బాలకృష్ణ, దాచేపల్లి ఎస్‌ఐ బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T05:27:32+05:30 IST