గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
ABN , First Publish Date - 2021-02-06T06:09:16+05:30 IST
గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసిన పాతగుంటూరు పోలీసులు మైనర్ సహా నలుగురిని అరెస్టు చేశారు.

మైనర్ సహా నలుగురి అరెస్టు.. గంజాయి స్వాధీనం
గుంటూరు, ఫిబ్రవరి 5: గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేసిన పాతగుంటూరు పోలీసులు మైనర్ సహా నలుగురిని అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వివరాలను వెల్లడించారు. నగరంలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన కట్టెంపూడి వినీల్ అలియాస్ విన్ను విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నాడు. వినీల్ నుంచి కొనుగోలు చేసిన కోబాల్డ్‌పేట రెండోలైనుకు చెందిన బొడ్డు వసంతరాయబాబు, నెహ్రూనగర్ 4వ లైనుకు చెందిన పఠాన్ అహ్మద్, సంగడిగుంట ఐదో లైనుకు చెందిన రౌడీషీటర్ బత్తుల వెంకటేశ్వర్లుతోపాటు, విద్యానగర్‌కు చెందిన ఓ మైనర్ గంజాయి వ్యాపారం చేస్తున్నారు. ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు సీఐ సురేష్‌బాబు, ఎస్‌ఐలు మేరాజ్, నాగరాజు ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు సాగర్‌బాబు, సురేష్‌కుమార్, వెంకటేశ్వర్లు, మన్నెప్రసాద్ శుక్రవారం బుడంపాడు బైపాస్ వద్ద దాడి చేసి గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సూత్రధారి వినీల్ పారిపోయాడు. వారి నుంచి ఎనిమిది కిలోల గంజాయితో పాటు లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కౌన్సెలింగ్
మధ్యలో చదువు మానేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో పరివర్తనకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన వారికి రివార్డులు అందజేశారు. మైనర్లు, యువకులు చెడు వ్యసనాలకు లోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు.