వైసీపీ పాలనలో దగాపడుతున్న రైతులు
ABN , First Publish Date - 2021-07-08T05:44:22+05:30 IST
రెండేళ్ల వైసీపీ పాలనలో రైతులు దగాకు గురవుతున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు.

జీవీ ఆంజనేయులు
గుంటూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల వైసీపీ పాలనలో రైతులు దగాకు గురవుతున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. వ్యవసాయంపై సీఎం జగన నిర్లక్ష్యం కారణంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటా రూ.1,868 గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వ లోపబూయిష్టమైన నిర్ణయాలతో బయట మార్కెట్‌లో రైతు రూ.1350కు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈక్రాప్ బుకింగ్‌లో పారదర్శకత లోపించి రైతుల పేరు నమోదు కాక ఆర్థికంగా నష్టపోయారన్నారు. 37లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టం వాటిల్లి రైతులు రూ.15వేల కోట్లు నష్టపోతే జగన ప్రభుత్వం రూ.1,252 కోట్లు ఇస్తామని చెప్పి వాటిలో రూ.921కోట్లు మాత్రమే రైతుల అకౌంట్లో జమచేసి కొండత పరిహారం ఇచ్చినట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. రైతు భరోసా ద్వారా రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.7,500 ఇచ్చారని తెలిపారు. 17నెలల పాలనలో జగన ప్రభుత్వం రూ.1.30లక్షల కోట్లు అప్పు చేసి రూ.70వేల కోట్ల పన్నులు ప్రజలపై భారం మోపిందని విమర్శించారు.