పోలీసుల సాక్షిగా.. దాడి

ABN , First Publish Date - 2021-02-08T05:33:21+05:30 IST

పంచాయతీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ మద్దతుదారులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు.

పోలీసుల సాక్షిగా.. దాడి
గ్రామంలో సవాల్‌ విసురుతున్న యువకులు

టీడీపీ మద్దతుదారులపై వైసీపీ ప్రతాపం

అంగలకుదురులో టీడీపీ నాయకుల ఆందోళన

తెనాలి రూరల్‌, ఫిబ్రవరి 7: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ మద్దతుదారులపై వైసీపీ నాయకులు దాడికి దిగారు.  పోలీసులు సమక్షంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది.  తెనాలి మండలం అంగలకుదురు పంచాయతీలో సర్పంచ్‌ అభ్యర్థి, వార్డు సభ్యులు ప్రచారం గడువు ముగిసిపోతుండటంతో ఆదివారం సాయంత్రం ఎస్సీ కాలనీలో ఓట్లు అభ్యర్థించేందుకు టీడీపీ నాయకులతో కలిసి వెళ్తున్నారు. అదే సమయంలో హఠాత్తుగా  కొందరు యువకులు వారిని అడ్డుకుని ఎమ్మెల్యేను తిట్టేది ఎవరంటూ దాడికి పాల్పడ్డారు.  దీంతో భయపడిన కొందరు పక్కకు వెళ్లిపోగా ఆ ప్రాంతంలో ఉన్న వాహనాలపై ప్రతాపం చూపారు. పార్టీలు వేరైనా ఎమ్మెల్యేని గౌరవిస్తామేకాని దూషించమని ఎవరో కావాలని తప్పుదారి పట్టించి ఉంటారని కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోకుండా దాడి చేశారని బాధితులు తెలిపారు. తెనాలికి సంబంధించిన వ్యక్తులు గ్రామంలో కర్రలు, ఆయుధాలతో సంచరిస్తున్నారని ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోనందునే ఈ దాడి ఘటన జరిగిందన్నారు. దాడి సమయంలో సమీపంలోనే పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని వాహనాలను ధ్వంసం చేస్తుంటే ఫోన్లలో వీడియోలు తీశారన్నారు. అట్రాసిటీ కేసులు పెడతామని దాడి చేసిన వ్యక్తులే తమను బెదిరించారన్నారు. దాడి చేసిన వారిపై కాకుండా, దాడికి గురైన తమపై పోలీసులు కేసులు పెట్టేందుకు సిద్ధమవడం దారుణమన్నారు. దాడికి నిరసనగా ఆదివారం రాత్రి వరకు టీడీపీ నాయకులు ఆందోళన చేయడంతో రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌ వచ్చి సర్దిచెప్పారు.  ఏకగ్రీవాలకు ఒప్పు కోలేదనే శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే అంగలకుదురులో వైసీపీ గుండాలు అలజడి సృష్టించడం దారుణమని, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. పోలీసులు వాస్తవాలను కప్పి పెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తే ఆందోళనకు దిగుతామని  హెచ్చరించారు.


Updated Date - 2021-02-08T05:33:21+05:30 IST