రాజధాని రైతులది గొప్ప సంకల్పం
ABN , First Publish Date - 2021-10-29T05:53:00+05:30 IST
అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులది గొప్ప సంకల్పమని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.
మహా పాదయాత్రకు మద్దతు.. ఒకరోజు హాజరు
అమరావతిలో పర్యటించిన సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ
తుళ్లూరు, అక్టోబరు 28: అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులది గొప్ప సంకల్పమని సీబీఐ విశ్రాంత జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో గురువారం ఆయన పర్యటించారు. రాజధాని ప్రాంతంలోని అసెంబ్లీ, సచివాలయ భవనాలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్జీవోల టవర్లను, జడ్జీల బంగ్లాలను, బ్రహ్మకుమారి సమాజం భవనాన్ని, రహదారులను ఆయన పరిశీలించారు. తొలుత ఉద్దండ్రాయునిపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు సిద్ధమవగా రోడ్లు ధ్వంసమై ఉండటంతో విరమించుకున్నారు. అనంతరం ఆయన తుళ్లూరులోని రాజధాని రైతుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రాజధాని రైతులు తలపెట్టి మహాపాదయాత్ర జయప్రదం అవుతుందన్నారు. పోరాట కారణం ప్రజలకు చెప్పాలన్నారు. ఒక రోజు పాదయాత్రలో పాల్గొంటానన్నారు. పాలకులు తమ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మహిళలు, రైతులు లక్ష్మీనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే మహాపాదయాత్ర జరగదన్నారు. ఆ విధంగా నిర్ణయం ఉంటుందని తాను ఆశిస్తున్నానన్నారు.
681వ రోజు కొనసాగిన ఆందోళనలు
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రాజధాని రైతు కూలీలు, మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమం గురువారం 681వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఐదుకోట్ల మంది ఆంధ్రుల రాజధాని అమరావతి అన్నారు. రాజధానికి భూములివ్వటమే నేరమన్నట్టు సీఎం జగన్‌రెడ్డి ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. రూ.పదివేల కోట్ల పనులు రాజధానిలో జరిగాయన్నారు. ఐదేళ్ల నుంచి పాలన అమరావతి నుంచే కొనసాగుతుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించిన సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. దొండపాడు, తుళ్లూరు, అనంతవరం, నెక్కల్లు, పెదపరిమి, ఐనవోలు, రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం తదితర రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి.