అన్ని వర్గాల మద్దతుతో మహా పాదయాత్ర

ABN , First Publish Date - 2021-10-28T05:34:57+05:30 IST

అమరావతి రాజధాని పరిరక్షణ కోసం చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల మద్దతు ఉంటుందని అమరావతి జేఏసీతో పాటు వివిధ పక్షాల నేతలు స్పష్టం చేశారు.

అన్ని వర్గాల మద్దతుతో మహా పాదయాత్ర
సమావేశంలో ప్రసంగిస్తున్న నక్కా ఆనందబాబు

1 నుంచి డిసెంబరు 17 వరకు కొనసాగనున్న కార్యక్రమం

ఏపీ హైకోర్టు నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర

జయప్రదం చేయడంపై గుంటూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం

గుంటూరు, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని పరిరక్షణ కోసం చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాల మద్దతు ఉంటుందని అమరావతి జేఏసీతో పాటు వివిధ పక్షాల నేతలు స్పష్టం చేశారు. పాదయాత్ర జయప్రదంపై  బుధవారం గుంటూరులోని వైన డీలర్స్‌ కల్యాణ మండపంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వివిధ పక్షాల నాయకులు పాల్గొని ప్రసంగించారు.  1 నుంచి డిసెంబరు 17 వరకు మహాపాదయాత్ర నిర్వహిస్తున్నట్లు అమరావతి జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. ఏపీ హైకోర్టు నుంచి తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర జరుగుతుందన్నారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దళిత బహుజన ఫ్రంట్‌ నేత భాగ్యారావు మాట్లాడుతూ 13 జిల్లాల్లోని బహుజన సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి ఉద్యమానికి పూర్తి అండగా నిలుస్తామని తెలిపారు. రాజకీయ విశ్లేషకులు, దళిత నేత బాల కోటయ్య మాట్లాడుతూ   ఉద్యమానికి చరమగీతం పాడాలని చూస్తున్న ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడబోతున్నారన్నారు. బీజేపీ బహిష్కృత నేత, రాజకీయ విశ్లేషకుడు వెలగపూడి గోపాలకృష్ణ  మాట్లాడుతూ అమరావతి విషయంలో బీజేపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లు కుట్రలు చేసి ఆంధ్రుల కళ్లలో కారం కొట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అమరావతి జేఏసీ నేతలు డాక్టర్‌ రాయపాటి శైలజ, పువ్వాడ సుధాకర్‌, గద్దె తిరుపతిరావు, మల్లికార్జునరావు తదితరులు ప్రసంగించారు. అధికార పార్టీ వైసీపీ మినహాయించి మిగిలిన రాజకీయ పార్టీలు మహాపాదయాత్రకు మద్దతు పలికాయి. 

- మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడితే తప్ప అమరావతి వ్యతలు తీరవన్నారు. అమరావతి పరిరక్షణ కోసం 680 రోజులుగా ఉద్యమం జరగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి పూర్తి మద్దతు అన్న జగన అధికారంలోకి రాగానే మాట మార్చారన్నారు. 

-  టీడీపీ గుంటూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ జేఏసీ పాదయాత్రలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని అప్పుడే ఉద్యమ తీవ్రత ప్రభుత్వానికి తెలుస్తోందన్నారు.  పాదయాత్రను చెదరకొట్టడానికి అధికారపార్టీ  ప్రయత్నిస్తుందని హెచ్చరించారు. 

-  కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను పెనుమార్పు చేసే యాత్రగా  దీనిని భావిస్తున్నామన్నారు. ఉద్యమానికి మద్దతుగా రాహుల్‌ గాంధీని కూడా అమరావతికి తీసుకొస్తామన్నారు. 

-  సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు  మాట్లాడుతూ అమరావతి ఉద్యమంపై రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్న పార్టీ నేతలతో ఉద్యమానికి ఒరిగేదేమిటని నిలదీశారు. తమ నేత శంకుస్థాపన చేసిన అమరావతినే కాపోడుకోలేని స్థితిలో ఆ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. మొదట మద్దతు తెలిపింది. బీజేపీనే

-  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ అమరావతి విషయంలో తమ పార్టీ ఇప్పటికే స్పష్టమైన వైఖరి తెలిపిందన్నారు. ఉద్యమానికి మొదట మద్దతు తెలిపిన రాజకీయ పార్టీ బీజేపీనేనన్నారు.  

-  జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరావతికి తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని, పోరాటం చేస్తుందన్నారు. మహాపాదయాత్రకు గ్రామగ్రామాన జనసేనపార్టీ ఘనస్వాగతం పలికి వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2021-10-28T05:34:57+05:30 IST