న్యాయం అమరావతి వైపే..

ABN , First Publish Date - 2021-08-20T05:47:18+05:30 IST

అమరావతి ఉద్యమంలో న్యాయం, ధర్మం ఉందని.. శాంతియుతంగా తమ సమస్యలను తెలియజేయటానికి పోరాటం చేస్తున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు.

న్యాయం అమరావతి వైపే..
పెదపరిమి శిబిరంలో దీపాలు వెలిగించి నినాదాలు చేస్తున్న మహిళలు, రైతులు

నేటి పాలకులే అన్యాయం చేస్తున్నారు..

అమరావతిని నిర్వీర్యం చేయవద్దు..

611వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 


తుళ్లూరు, ఆగస్టు 19: అమరావతి ఉద్యమంలో న్యాయం, ధర్మం ఉందని.. శాంతియుతంగా తమ సమస్యలను తెలియజేయటానికి పోరాటం చేస్తున్నామని రాజధాని రైతులు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం తమ మొర ఆలకించకుండా ఉద్యమం అణచివేతకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని వారు చేస్తున్న ఉద్యమం గురువారం 611వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు, మహిళలు, రైతు కూలీలు మాట్లాడుతూ ప్రభుత్వం భూములు అడిగితే రాజధాని కోసం ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రపంచస్థాయి ప్రజారాజధాని ఏర్పడుతుందని అందరూ ఆశపడ్డారన్నారు. కానీ ప్రభుత్వం మారగానే మూడు రాజధానులంటూ అమరావతి రాజధానిని నాశనం చేశారన్నారు. అమరావతిని ముమ్మాటికీ స్వాగతిస్తున్నామని.. విజయవాడ గుంటూరు మధ్య 30వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్‌రెడ్డి  చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు మూడుముక్కల ఆట ఆడుతున్నారని మండిపడ్డారు. నీతి నియమాలు లేవా.. అంటూ ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల అభివృద్ధిని నాశనం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పెయిడ్‌ ఆర్టిస్టులం కాదని స్పష్టం చేశారు. భూములిచ్చిన స్థానిక రాజధాని రైతులమన్నారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం పెయిడ్‌ ఆర్టిస్టుల చేత మూడు రాజధానులని దీక్ష చేయిస్తోందని స్పష్టం చేశారు. మూడు అని ముచ్చట పడితే ఎవరి ప్రాంతంలో వారు దీక్షలు చేయాలన్నారు. రెచ్చగొట్టి కేసులు పెట్టించటానికి బయటవారిని దీక్షలో కూర్చోబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలు చేసిన రైతుల సమస్యలను ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికైనా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. తమ పక్కన న్యాయం ఉంది..  అంతిమ విజయం తమదే అని స్పష్టం చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. జై అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. 

Updated Date - 2021-08-20T05:47:18+05:30 IST