ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాల్సిందే
ABN , First Publish Date - 2021-12-15T05:42:44+05:30 IST
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరుపతి సభ జరిగి తీరుతుంది
నేడు జిల్లావ్యాప్తంగా మద్దతు ర్యాలీలు
అఖిలపక్ష సమావేశంలో నాయకులు
గుంటూరు(తూర్పు), డిసెంబరు14: రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు సంఘీభావంగా రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కొత్తపేట మల్లయ్యలింగం భవన్‌లో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి నడిబొడ్డున సకల సౌకర్యాలు కలిగిన అమరావతే రాష్ట్రరాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ పాదయాత్రకు సంఘీభావంగా నగరంలో బుధవారం ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్ రెడ్‌స్టార్ నాయకులు హరిప్రసాదు, ఎంసీపీఐయూ నాయకులు కె.శ్రీధర్, టీడీపీ నాయకుడు దాసరిరాజా మాస్టారు, తాడికొండ నరసింహారావు తదతరులు పాల్గొన్నారు.