మిర్చి నష్టాన్ని.. జాతీయ విపత్తుగా భావించాలి

ABN , First Publish Date - 2021-12-31T06:02:59+05:30 IST

తామర పురుగు, తుపాన్లతో ఆరు రాష్ట్రాల్లో మిర్చి దెబ్బతిన్నందున జాతీయ విపత్తుగా భావించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు.

మిర్చి నష్టాన్ని.. జాతీయ విపత్తుగా భావించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రావుల వెంకయ్య. పాల్గొన్న ముప్పాళ్ల

ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య

గుంటూరు(తూర్పు), డిసెంబరు 30: తామర పురుగు, తుపాన్లతో ఆరు రాష్ట్రాల్లో మిర్చి దెబ్బతిన్నందున జాతీయ విపత్తుగా భావించి రైతులను ఆదుకోవాలని ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు. కొత్తపేట మల్లయ్య లింగం భవన్‌లో గురువారం జరిగిన మిర్చి రైతుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు.  వ్యవసాయ రంగంలో పరిశోధనల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ్రద్ధ చూపడం వల్లే తామర పురుగు వంటి విపత్తులను రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దేశంలో దాదాపు 53 రకాల ప్రధాన పంటలుండగా 23 పంటలకు మాత్రమే మద్దతు ధరలు ప్రకటించడం అన్యాయమన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి, వరి రైతులకు ఆదుకోవాలని 6న అన్ని నియోజకవర్గాల్లో రాస్తారోకో చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు శ్రీనివాస్‌, కేవీవీ ప్రసాద్‌, జంగాల అజయ్‌కుమార్‌, కొల్లి రంగారెడ్డి, హనుమారెడ్డి, ఎం యలమందరావు, రామకృష్ణ, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T06:02:59+05:30 IST