ఆధార్‌ కేంద్రాలను సందర్శించిన జేసీ

ABN , First Publish Date - 2021-08-20T05:35:25+05:30 IST

రేషన్‌ కార్డు ఈ-కేవైసీ కోసం వేలిముద్రల అప్‌డేట్‌ చేసుకునేందుకు ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను జేసీ దినేష్‌కుమార్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఆధార్‌ కేంద్రాలను సందర్శించిన జేసీ
ఆధార్‌ నమోదు కేంద్రాన్ని సందర్శించి వివరాలు తెలుసుకుంటున్న జేసీ దినేష్‌కుమార్‌

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

గుంటూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డు ఈ-కేవైసీ కోసం వేలిముద్రల అప్‌డేట్‌ చేసుకునేందుకు ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద ప్రజలు ఎదుర్కొంటోన్న ఇబ్బందులను జేసీ దినేష్‌కుమార్‌ ప్రత్యక్షంగా పరిశీలించారు. గురువారం ఆంధ్రజ్యోతి సంచికలో రేషన్‌... టెన్షన్‌ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. గుంటూరు మార్కెట్‌ సెంటర్‌ సమీపంలో ఉన్న యూనియన్‌ బ్యాంకు మెయిన్‌ బ్రాంచ్‌ ఆవరణలో ఉన్న ఆధార్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఆధార్‌ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వన్‌ నేషన్‌... వన్‌ రేషన్‌ కార్డు పేరుతో ఈ-కేవైసీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈ దృష్ట్యాలో జిల్లాలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని వారి కోసం ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చామన్నారు. అన్నిరకాల పౌరసేవలు పొందేందుకు ఈ-కేవైసీ విధానం అవసరమన్నారు. జిల్లాలో మొత్తం 168 ఆధార్‌ కేంద్రాలుండగా మరో 23 కేంద్రాలను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ-కేవైసీ నమోదు గ్రామ/వార్డు సచివాలయాల్లోనే ఎక్కువగా వలంటీర్లు చేస్తోన్నారన్నారు. చాలామంది ఈ విషయం తెలియక మీ-సేవ కేంద్రాలకు వెళుతున్నారని చెప్పారు. కొత్తగా ఆధార్‌ కేంద్రాల్లో ఈ-కేవైసీ నమోదుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. బయోమెట్రిక్స్‌కి రూ.100, మార్పులు, చేర్పుల కోసం రూ. 50 చెల్లించాలన్నారు. 15 ఏళ్ల వయస్సు దాటిన వారు, దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఆగస్టు 31కి ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. 15 ఏళ్ల లోపు వారు సెప్టెంబరు నెలాఖరు వరకు గడువు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పద్మశ్రీ, ఎల్‌డీఎం రాంబాబు, బ్యాంకు మేనేజర్‌ చక్రధర్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-08-20T05:35:25+05:30 IST