టీడీపీ రెడీ!

ABN , First Publish Date - 2021-02-26T06:16:12+05:30 IST

గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై తెలుగుదేశం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

టీడీపీ రెడీ!
జిల్లా టీడీపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు తెలుగుదేశం సన్నద్ధం

రంగంలోకి దిగిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్న

రెబల్స్‌కు అధిష్టానం నుంచి పిలుపు


గుంటూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై తెలుగుదేశం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో గురువారం సమావేశం నిర్వహించారు. కార్పొరేటర్‌ అభ్యర్థుల ఖరారు, ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అభ్యర్థుల బలాబలాలు, ప్రత్యర్థి వ్యూహాలు తదితర అంశాలపై నేతలు అభిప్రాయాలు తీసుకున్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే దూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌, తూర్పు, పశ్చిమ ఇన్‌చార్జులు నసీర్‌ అహ్మద్‌, కోవెలమూడి రవీంద్ర(నాని), రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిని చిట్టిబాబు, గుంటూరు పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


రెబల్స్‌కు పిలుపు..

గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని పలు డివిజన్లలో పార్టీ తరఫున ఒకటి కంటే ఎక్కువమంది నేతలు నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు ఎవరికీ బీఫారాలు ఇవ్వలేదు. పోటీలో ఉన్న నేతలతో అచ్చెన్నాయుడు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం సమవేశం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయా నేతలకు పిలుపు అందినట్లు తెలుస్తోంది. ప్రచారం, పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయాల్లో నేతలను సమన్వయం చేయటానికి రెండ్రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి డివిజన్‌ను సమీక్షించటానికి జిల్లా కమిటీలో సభ్యులను నియమిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. 


కొలిక్కి వచ్చిన 42, 43 డివిజన్ల పంచాయతీ 

పశ్చిమలో టీడీపీకి పట్టున్న 42, 43వ డివిజన్లలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు.  42వ డివిజన్‌లో వేములపల్లి శ్రీరాంప్రసాద్‌ (బుజ్జి), ముత్తినేని రాజేష్‌ పోటీ పడుతున్నారు. వారిద్దరిని సంతృప్తి పరిచేలా అధిష్టానం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 42వ డివిజన్‌ అభ్యర్థిగా శ్రీరాంప్రసాద్‌ ఖాయమంటున్నారు. ముత్తినేని రాజేష్‌కు కోఆప్షన్‌ సభ్యుడిగా అవకాశం ఇస్తామని హామీ వచ్చినట్లు సమాచారం. 43వ డివిజన్‌లో సుఖవాసి శ్రీనివాసరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, కొల్లి అనిల్‌ పోటీ పడుతున్నారు. వారిలో అధిష్టానం కోటేశ్వరరావు వైపు మొగ్గినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మిగిలిన ఇద్దరితో శుక్రవారం అచ్చెన్నాయుడు సమావేశం అవనున్నారు. దీంతో పార్టీకి పశ్చిమలో సమస్యగా ఉన్న ఈ రెండు డివిజన్ల సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లే.

Updated Date - 2021-02-26T06:16:12+05:30 IST