రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-11-29T05:27:04+05:30 IST
నరసరావుపేట- చిలకలూరిపేట రహదారిపై మండలంలోని బసికాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

నరసరావుపేటరూరల్, నవంబరు28: నరసరావుపేట- చిలకలూరిపేట రహదారిపై మండలంలోని బసికాపురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నరసరావుపేట రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా జె పంగులూరు మండలం బైటమంజులూరు గ్రామానికి చెందిన చింతల వెంకట్రావు(45), హైదరాబాద్కు చెందిన తుమ్మల యాదగిరి(62) సుబాబుల్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. శనివారం నరసరావుపేట మండలంలో పలు గ్రామాల్లో సుబాబుల్ తోటలను పరిశీలించి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా నరసరావుపేట వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇరువురును 108 వాహనంలో నరసరావుపేటకు తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు చింతల వెంకట్రావు భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు.