కారు ప్రమాదంలో డ్రైవర్ సహా.. తండ్రీకొడుకుల దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-24T05:37:20+05:30 IST
హైదరాబాద్ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు.

హైదరాబాద్ శివారులో ఘటన
మృతులు పొన్నూరు వాసులు
పొన్నూరుటౌన్, మార్చి 23: హైదరాబాద్ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. సేకరించిన వివరాల మేరకు.. పొన్నూరుకు చెందిన కనికచర్ల ఉపేంద్రనాథ్‌గుప్తా (47) 15 ఏళ్ల కిందట స్థానికంగా వస్త్రవ్యాపారం చేసేశారు. వ్యాపారం కలిసి రాకపోవడంతో కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. సరూర్‌నగర్ సమీపంలోని వెంకటేశ్వరనగర్ కాలనీలో నివసిస్తూ కళానికేతన్‌లో ఉద్యోగం చేస్తూ కుమారుడుని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమారుడు రిషిక్ (27) రష్యాలోని ఉక్రేన్‌లో ఎంబీబీఎస్ నాలుగోవ సంవత్సరం అభ్యసిస్తున్నాడు. కరోనా నేపధ్యంలో రిషిక్ ఇటీవలే హైదరాబాద్ తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. కుమారుడునికి స్వగ్రామంలోని చందోలుతోపాటు పొన్నూరులోని బంధుమిత్రులకు చూపించటంతోపాటు, పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తి విషయం మాట్లాడుకోవాటానికి ఉపేంద్ర సోమవారం కారులో డ్రైవర్ ప్రభాకర్‌తో కలిసి పొన్నూరు వచ్చారు. బంధువులను కలిసిన అనంతరం రాత్రికి హైదరాబాదు బయల్దేరి వెళ్లారు. ఉదయం హైదరాబాదు సమీపంలోని పెద్దఅంబర్‌పేట ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద మెదక్ వెళుతున్న లారీని కారు ఢీ కొంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అవటంతో కారులో ప్రయాణిస్తున్న ఉపేద్రనాథ్, కుమారుడు రిషిక్, డ్రైవర్ ప్రభాకర్ అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. ఉపేంద్రనాథ్ భార్య అనిత అనాథగా మిగిలిపోయింది. ఉపేంద్రనాథ్, రిషిక్ మృతదేహాలను పొన్నూరు తరళించి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు సన్నాహాలు చేస్తున్నారు.