పది దాటేదెలా?

ABN , First Publish Date - 2021-05-02T05:39:55+05:30 IST

దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంది.

పది దాటేదెలా?

పరీక్షలపై టెన్త్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన 

జూన్‌1 వరకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

అదే నెల మొదటివారంలో పరీక్షలకు సిద్ధం చేయాలంటూ ఆదేశాలు

అదెలా సాధ్యం అంటున్న ఉపాధ్యాయులు

నూతన పరీక్ష విధానంపై కూడా సన్నద్ధత కరువు

 

గతంలో ఎన్నడూ లేని విధంగా పది పరీక్షలు విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర గందరగోళం వైపు నడిపిస్తున్నాయి. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఓవైపు భయపెడుతుంటే.. మరోవైపు ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఏడు పేపర్ల విధానం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మీ పిల్లలకు మేనమామనవుతా అంటూ ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్నే ఇప్పుడు విద్యార్థులు గుర్తుచేస్తూ మావయ్యా పది దాటించవయ్యా అంటూ వేడుకుంటున్నారు. 

 

గుంటూరు(తూర్పు), మే1: దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంది. దీంతో విద్యార్థులతోపాటు, ఇటువంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలియక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతిపక్షాలు, మేధావుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో జూన్‌1వ తేదీవరకు నెల పాటు పాఠశాలలకు రాకుండా పది విద్యార్థులకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ఈనెల రోజులు డిజిటల్‌ మాధ్యమాల ద్యారా తరగతులను నిర్వహించాలంటూ ఉపాధ్యాయులను ఆదేశించింది.


ఎంతమందికి స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయి..?

గత సంవత్సర గణంకాల ప్రకారం జిల్లాలో దాదాపు 65శాతం మంది విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులేవు. వీటిలో గ్రామీణ ప్రాంత విద్యార్థు సంఖ్య అధికం. ఈ సంవత్సరం కూడా జిల్లాలో  దాదాపుగా 58 వేలమంది విద్యార్థులు పది పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ తరగతులు ఎలా నిర్వహించాలో తెలియడం లేదు. ఇదిలా ఉంటే సెలవుల తరువాత అంటే జూన్‌ 1నుంచి విద్యార్థులు పాఠశాలలకు తప్పనిసరిగా హాజరవ్వాలని జూన్‌ 6 వరకు వారిని పరీక్షలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆదేశించింది. దీనికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఆరురోజుల్లో పరీక్షలకు ఎలా సిద్ధం చేయాలో ప్రభుత్వమే చెప్పాలని కొంతమంది ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 


నూతన విధానంపై అవగాహన లేమి

 గతంలో ఉన్న 11 ప్రశ్నపత్రాల స్థానంలో ప్రభుత్వం నూతనంగా ఏడు పేపర్ల విధానాన్ని  తీసుకొచ్చింది.  నూతన విధానం అమల్లోకి వచ్చినపుడు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. కానీ ఈ విద్యాసంవత్సరంలో సంగ్రహణ మూల్యాంకనం పేరున కొద్దిపాటి సిలబస్‌లతో 25 మార్కులకు రెండుసార్లు మాత్రమే పరీక్షలు నిర్వహించారు. అంతే తప్ప 100 మార్కులకు ఒక్కసారి కూడా ముందస్తు పరీక్షలు నిర్వహించలేదు. మే15 నుంచి ఏకధాటిగా ప్రీఫైనల్స్‌ను నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ కరోనా కారణంగా ఈ మధ్యనే వాటిని కూడా రద్దుచేసింది. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పుడు సెలవులు ప్రకటించినప్పటికీ గత 45 రోజులనుంచి కొవిడ్‌ దృష్ట్యా పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం అంతంతమాత్రంగానే ఉంది. మరి వీరందరికీ నూతన పేపరు విధానంపై అవగాహన ఎప్పుడు కల్పించాలో అన్నదానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. 


పీఎంసీలు ఎక్కడా..?

విద్యార్థుల సమస్యలు, స్కూల్స్‌ అభివృద్ధి గురించి చర్చించేందుకు పాఠశాలలో నియమించిన పేరెంట్స్‌ మానటిరింగ్‌ కమిటీలు ఇటువంటి విపత్కర పరిస్ధితుల్లో ఏంచేస్తున్నాయో అర్ధం కావడం లేదు.  కొవిడ్‌ భయంతో పిల్లలను పాఠశాలలకు పంపడం కూడా మానివేసిన కమిటీల్లోని తల్లిదండ్రులు పరీక్షలు రద్దు  లేదా కనీసం వాయిదా వేయమని ప్రభుత్వాన్ని మాత్రం అడగలేకపోతున్నాయి. కమిటీల్లో ఎక్కువమంది నిరక్ష్యరాసులు ఉండటం, అవేదో రాజకీయ పదవుల్లా భావించడం వలనే పీఎంసీలకు ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

 



Updated Date - 2021-05-02T05:39:55+05:30 IST