వెలుగు అధికారుల డ్రామా!

ABN , First Publish Date - 2021-07-12T05:48:23+05:30 IST

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా నడుస్తున్న వైఎస్సార్‌ క్రాంతి పథం (వెలుగు)కు అనుబంధంగా రంపచోడవరంలోని ట్రైబల్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ యూనిట్‌ (టీపీఎం యూ)లో గత ఆరు నెలల కాలంలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ యూనిట్‌ను నడిపించే అధికారే తనకు అనుకూలురైన సిబ్బందితో అక్రమాలకు తెరలేపారు. కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్పాదకుల సంఘాలు (ఎఫ్‌పీవో), వం

వెలుగు అధికారుల డ్రామా!

వైఎస్సార్‌ క్రాంతి పథం గిరిజన యూనిట్లో 

కోట్ల రూపాయలు దుర్వినియోగం

ఎఫ్‌పీవోలు, వీడీవీకేలు, మహిళా సమాఖ్యల 

ఖాతాల్లోంచి అక్రమ వాడకం

నిబంధనలకు విరుద్ధంగా 

అక్రమాలకు పాల్పడుతున్న వైనం

అందులో పనిచేసే ఉద్యోగుల నుంచే 

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు


మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా నడుస్తున్న వైఎస్సార్‌ క్రాంతి పథం (వెలుగు)కు అనుబంధంగా రంపచోడవరంలోని ట్రైబల్‌ ప్రాజెక్టు మోనిటరింగ్‌ యూనిట్‌ (టీపీఎం యూ)లో గత ఆరు నెలల కాలంలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి. ఈ యూనిట్‌ను నడిపించే అధికారే తనకు అనుకూలురైన సిబ్బందితో అక్రమాలకు తెరలేపారు. కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ఉత్పాదకుల సంఘాలు (ఎఫ్‌పీవో), వందన వికాస  కేంద్రాల (వీడీవీకే) నిధులతో పాటు గిరిజన మహిళా సమాఖ్య, వాటర్‌ షెడ్‌ తదితర పద్దుల నిధులను ఇష్టారాజ్యంగా బ్యాంకుల నుంచి తీయించి సాగిస్తున్న బాగోతం అందులో పనిచేసే ఉద్యోగుల ఫిర్యాదుతో తేటతెల్లమైంది.


(రంపచోడవరం)

రంపచోడవరంలోని రైతు ఉత్పాదకుల సంఘాలకు సంబంధించి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లోనే సుమారు రూ.1.88 కోట్లు డ్రా చేశారు. వీడీవీకేల విషయానికొస్తే సుమారు రూ.10.65 లక్షలు డ్రా చేశారు. గిరి జన మహిళా సమాఖ్య నుంచి రూ.24 లక్షలు, ఏడు మండల మహిళా సమాఖ్యల నుంచి రూ.75 లక్షలు వెరసి సుమారు రూ.2.97 కోట్లు డ్రా చేశారు. వీటిలో చాలానిధులు నిబంధనలకు భిన్నంగా డ్రా చేసినవే ఉన్నాయని అందులో పనిచేసిన వారు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం. కేంద్రం అమల్లోకి తెచ్చిన ఎఫ్‌పీవోలు, వీడీవీకేల ద్వారా రైతులకు వచ్చే వ్యవసాయ, ఉద్యానవన దిగుబడులను విలువ హెచ్చింపు చేస్తూ ఆయా ఉత్పాదనలకు మంచి గిరాకీ పెంచి వాటి ఆదాయాన్ని రైతులకే చెందేలా చేయడమే లక్ష్యం. దీని కోసం రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్‌ ఆదిత్య పటిష్ఠమైన చర్యలు చేపట్టి, దిశా నిర్దేశం చేశారు. పంట దిగుబడులన్నీ ఎఫ్‌పీవోల ద్వారావందన వికాస కేంద్రాలకు చేర్చడం, ఆయా ఉత్పాదనలను మార్కెటింగ్‌కు వీలుగా తీర్చిదిద్దడం కూడా రైతుల ద్వారానే జరిగేలా సూచనలు చేశారు. వీటి పర్యవేక్షణను వైఎస్సార్‌ ప్రగతి పథం అనుబంధంగా వున్న రంపచోడవరం టీపీఎంయూకి అప్పగించారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఆయా పద్దుల నుంచి టీపీఎంయూ అధికారులు నిధులను డ్రా చేయించేశారు.  వాటిని రైతుల పేరున గానీ, ఏమైనా కొనుగోలు చేస్తే ఆయా విక్రయ సంస్థల పేరున గానీ చెక్కుల రూపంలో చెల్లించాల్సి ఉండగా ఆయా ఎఫ్‌పీవోల పరిధిలోని కో-ఆర్డినేటర్ల  పేరుతోనే చెక్కులద్వారాను, చాలా చోట్ల ఆయా సంఘాల ఖాతా నిర్వహణదారులైన గిరిజన పెద్దలకు తెలియకుండానే డ్రా చేసేశారు. ఉదాహరణకు రాజవొమ్మంగి ఎఫ్‌పీవో నిధులను అక్కడ పనిచేసే కో-ఆర్డినేటర్‌ పేరున డ్రా చేయించేశారు. 


అడ్డతీగల, వై.రామవరం ఇలా అన్ని ఎఫ్‌పీవోల నుంచీ ఇదే విధంగా నగదును   డ్రా చేయించేశారు. వీడీవీకేల విషయానికి వస్తే ఏడు మండలాల్లో 90 కేంద్రాలున్నాయి. వాటిలో 61 వీడీవీకేలకు ట్రైఫెడ్‌ అనుమతి లభించి రూ.4.57 కోట్లు విడుదలయ్యాయి. వీటిని కూడా ఇష్టానుసారమే డ్రా చేసి ఆయా ఉత్పాదనలను కొనుగోలు చేసినట్టు చూపిస్తున్నారు.  వాస్తవానికి వీడీవీకేలకు ఆయా రైతు ఉత్పత్తులనే వారితోనే రప్పించి, వారితోనే మార్కెటింగ్‌కు వీలుగా ఉత్పాదనల విలువ హెచ్చింపు చేయాలి. కానీ ఇందుకు భిన్నంగా అనేక నిధులను ఆయా ఉత్పత్తులనుప్రయివేటు వ్యాపారుల నుంచి కూడా కొనుగోలు చేశారు. ఈ నిధులను ఎలా, ఎవరి పేరున డ్రా చేశారో చూస్తే అన్నీ బయటపడతాయి. ఈ మొత్తం బాగోతంలో తప్పులన్నిటినీ టీపీఎంయూ నిర్వాహకుల ఆధ్వర్యంలోనే ఓ బృందం ఇదే పనిగా సాగించింది. ఎప్పుడైనా వెలుగు చూస్తే మాత్రం ఆయా సంఘాలు, సీసీల పేరుతోనే జరిగినట్టుగా చెప్పుకోవడానికి వీలుగా తెలివిగా నిధులను వారి పేరుతోనే జరిగేలా చూసుకుని వారిని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. రంపచోడవరం గిరిజన మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఈ చర్యలను వ్యతిరేకిస్తుండగా, ఆమెకు తెలియకుండా కూడా కొన్ని నిర్ణయాలను టీపీఎంయూ తీసుకుంది. గత  ఆరు నెలలుగా విచ్చలవిడిగా సాగుతన్న ఈ బాగోతంలో తమ వాటాలు తీసుకున్న సిబ్బంది మౌనంగా ఉంటే, అక్రమాలను సహించలేని వారు మాత్రం ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా ఈ వ్యవహారంలో డీఆర్డీఏ నుంచి సెర్ప్‌ వరకు పలువురి భాగస్వామ్యం కూడా ఉందన్న ఆరోపణలూ వస్తున్నాయి. 


విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

రంపచోడవరం టీపీఎంయూలో నిధులను అక్రమంగా డ్రా చేసి వినియోగించిన అంశంపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరంగా విచారణ జరిపిస్తాం.  ఇవి నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

వై.హరిహరనాథ్‌, డీఆర్డీఏ పీడీ

Updated Date - 2021-07-12T05:48:23+05:30 IST