బేబీ కిట్లు ఏవి!
ABN , First Publish Date - 2021-01-06T07:12:33+05:30 IST
ప్రజా సంక్షేమమే పరమావధి, పేదరికం ఏ రూపంలో ఉన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సభలు, సమీక్షల్లో సీఎం జగన్, అమాత్యులు ఢంకా బజాయిస్తూనే ఉన్నారు. అయితే వారి మాటలకు, కార్యాచరణ అమలుకు పొంతన ఉండడం లేదు. ఉదాహరణకు గత టీడీపీ ప్రభుత్వం 20
కరోనా సాకుతో గత ఏడాది మార్చి
నుంచి ఇప్పటి వరకు నిలిచిన సరఫరా
నవజాత శిశువుల సంరక్షణకు టీడీపీ
ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన పథకం
ఈ ప్రభుత్వంలో పేరుమార్చి
తూతూమంత్రంగా అమలు
పునరుద్ధరించి సజావుగా
పంపిణీ చేయాలని తల్లుల వేడుకోలు
ప్రజా సంక్షేమమే పరమావధి, పేదరికం ఏ రూపంలో ఉన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సభలు, సమీక్షల్లో సీఎం జగన్, అమాత్యులు ఢంకా బజాయిస్తూనే ఉన్నారు. అయితే వారి మాటలకు, కార్యాచరణ అమలుకు పొంతన ఉండడం లేదు. ఉదాహరణకు గత టీడీపీ ప్రభుత్వం 2016లో నవజాత శిశువుల సంరక్షణ కోసం (మొదటి మూడు నెలలు) ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఒక పథకాన్ని అమలు చేసి సక్సెస్ అయ్యింది. కిట్లలో ఉండే ఖరీదైన సామగ్రి పెట్టి ఉచితంగా పంపిణీ చేయడంతో ఎందరో నిరుపేద తల్లులు లబ్ధి పొందారు. దీనినే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ బేబీ కిట్ల పథకంగా మార్చిన సంగతి తెలిసిందే. కొంతకాలం సజావుగా సరఫరా చేసిన సదరు కిట్లను కరోనా సాకుతో గత మార్చి నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు నిలిపివేసింది. వాస్తవానికి వీటిని సరఫరా చేసే సంస్థలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయి పడడంతో కంపెనీ తయారీ నిలిపివేసిందని తెలుస్తోంది. నిధుల కొరత ఏర్పడడంతో ఇప్పుడు ఈ పథకం కొనసాగుతోందో లేదో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో 120 పీహెచ్‌సీలు, 840 సబ్ సెంటర్లు, 26 సీహెచ్‌సీలు, 38 అర్బన్ హెల్త్ సెంటర్లు, 24 గంటలు పనిచేసే 38 పీహెచ్‌సీలు, 9 ఏరియా ఆసుపత్రులు వున్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరంల్లో జీజీహెచ్‌లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పుడు కొవిడ్ వ్యాక్సినేషన్‌పై సీరియస్‌గా దృష్టి సారించింది. దీంతో బేబీ కిట్ల ఊసు విస్మరించింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతీనెలా రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి. సగటున ఒక్కో నెలలో 4 నుంచి 6 వేల జననాలు ఉంటు న్నాయి. ఇక్కడకు పురుళ్ల కోసం వచ్చే తల్లుల్లో నూటికి 90 శాతం పేదలే. గ్రామాల్లో పీహెచ్‌సీలున్నప్పటికీ కాకినాడ ఆస్పత్రిలో అయితే కాన్పు చాలా సులభంగా జరుగుతోందని, అత్యవసరమైతే తప్ప సిజేరియన్ చేయరనే ప్రచారం ఉండడంతో పల్లెల నుంచి అధిక శాతం పేద గర్భిణులు ఇక్కడకు వస్తుంటారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా పెద్ద సంఖ్యలోనే డెలివరీలు చేస్తున్నారు. ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో కూడా ప్రసవాలు అధికంగానే జరుగుతున్నాయి. ప్రసవం జరిగాక పిల్లలకు వాడే మెత్తటి తువ్వాలు, చేతులు శుభ్రం చేసేకునే లిక్విడ్, బేబీకి ఒక పరుపు, దోమ తెర ఒక కిట్‌లో పెట్టి ఇచ్చేవారు.
తొమ్మిది నెలలుగా ఈ కిట్లు ఇవ్వకపోవడంతో తల్లులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాదిలో జిల్లావ్యాప్తంగా మే నుంచి నవంబరు వరకు ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 15వేల ప్రసవాలు నమోదయ్యాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ స్టాటిటిక్స్ విభాగం రికార్డులు సూచిస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి కిట్లు రాకపోవడంతో చాలామంది వారి ఆర్థిక స్తోమత మేరకు బయట కొనుగోలు చేస్తున్నారు. కొవిడ్ వంకతో బేబీ కిట్ల సరఫరా నిలిపివేయడంతో తల్లులు కొంత నిరాశపడినా, తప్పని పరిస్థితిలో కొనుగోలు చేసుకుంటున్నారు. పోనీ కిట్లు వచ్చాక ఇస్తారా అని వైద్య సిబ్బందిని తల్లులు అడుగుతుంటే... కొత్త జననాలకు ఇస్తామని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారికి ఇ వ్వమని చెప్తుండడంతో ఉచితంగా ఇచ్చే కిట్లలో కూడా ఈ కక్కుర్తి ఏమిటని తల్లులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు ఆశ పెట్టడం
బేబీ కిట్ కావాలని మేం అడగలేదు. మా ఏరియాలో ఉంటున్న ఆశ కార్యకర్త మా పిల్ల వద్దకు వచ్చి డెలివరీ కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లొద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో చేరితే బేబీకి ఒక కిట్ ఇస్తారని చెప్పింది. కిట్ కోసం కాకపోయినా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో మా పిల్లను డెలివరీకి చేర్చాను. కాన్పు అయ్యాక కిట్ ఇస్తారోమోనని నర్సును అడిగాను. స్టాకు లేదన్నారు. లేదా ఉన్నా ఇవ్వరా అని అడిగితే చాలా రోజుల నుంచి రావడం లేదని, వస్తే ఆశ కార్యకర్తకు ఇచ్చి పంపుతామన్నారు. నెల అయినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. డెలివరీ అయిన రోజే బేబీకి కిట్ కొన్నాను. ఆశపెట్టడం ఎందుకు? తర్వాత లేదనడం ఎందుకు.
ఓ గర్భిణి తల్లి, గొడ్డటిపాలెం, కరప మండలం