గతుకుల పాలన

ABN , First Publish Date - 2021-05-30T05:35:10+05:30 IST

అభివృద్ధి మంత్రంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమ జపం చేస్తున్నా అవి అర్హుల దరిచేరట్లేదు. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేసిన గ్రామ/ వార్డు సచివాలయాలు సత్ఫలితాలు ఇవ్వట్లేదు. వృద్ధాప్య పింఛను పెంచట్లేదని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు.

గతుకుల పాలన
మండపేట-ద్వారపూడి రోడ్డులో ఇప్పనపాడు వద్ద రహదారి దుస్థితి

రహదారులు దారుణం

కట్టిన ఇళ్లు ఇవ్వలేదు... కొత్తవీ కట్టలేదు

పోలవరం నిర్వాసితులను గాలికి వదిలేశారు

సంక్షేమ పథకాలు కొందరికే!

నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజల్లో అసహనం

యథేచ్ఛగా మట్టి, గ్రావెల్‌ దందా

ఇదీ వైసీపీ రెండేళ్ల పాలన తీరూతెన్నూ


అభివృద్ధి మంత్రంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సంక్షేమ జపం చేస్తున్నా అవి అర్హుల దరిచేరట్లేదు. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాటుచేసిన గ్రామ/ వార్డు సచివాలయాలు సత్ఫలితాలు ఇవ్వట్లేదు. వృద్ధాప్య పింఛను పెంచట్లేదని వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. జగనన్న విద్యా దీవెన పథకంలోని నిబంధనలతో చాలా మంది పిల్లలు నష్టపోతున్నారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో పూర్తి ఫీజు చెల్లించాల్సి రావడంతో పిల్లల చదువుల విషయంలో కొన్ని కుటుంబాలు చాలా ఇబ్బందిపడుతున్నాయి. రేషన్‌కార్డుదారులకు సమస్య ఉంది. బ్యాంకు రుణం కోసమో, ఇతర అవసరాల కోసమో ఇన్‌కంటాక్స్‌ రిటర్న్‌ చూపిస్తే వారికి ఏ సంక్షేమ పథకాలూ వర్తించట్లేదు. డ్వాక్రా వడ్డీ మాఫీ అన్నారు. కానీ ఈ ఏడాది చాలా మందికి డబ్బులు పడలేదు. ఇలా సంక్షేమ పథకాలు కొంతమందికి అంది, కొందరికి అందకపోయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది.


(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ రెండేళ్ల పాలనలో జిల్లాలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రోడ్లు దారుణాతి దారుణంగా ఉండడంతో ప్రజలు నరకం చూశారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్ల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడక్కడా రిఫేర్లు మాత్రమే చేస్తున్నారు. అందులోనూ అవకతవకలే. దివాన్‌చెరువు నుంచి పుణ్యక్షేత్రం వెళ్లే రోడ్డును నిర్మించినా బెరమ్స్‌ వేయడం మరిచారు. దీంతో ఆ మార్గం ప్రమాదకరంగా మారింది. రాజమహేంద్రవరం జాతీయ రహదారిపై ఐదు ఫ్లై ఓవర్లు శాంక్షన్‌ అయ్యాయి. కానీ ఇవాళ అవన్నీ రద్దయినట్టు సమాచారం.


పునరావాసం మరిచారు

పోలవరం ఎగువ కాఫర్‌డ్యామ్‌ గ్యాప్‌ పూర్తి చేసి గోదావరికి అడ్డుకట్ట వేశారు. దీంతో గోదావరి వరద నీరంతా కాఫర్‌డ్యామ్‌ ఎగువ భాగంలోనే నిలిచిపోతుంది. స్పిల్‌వే గేట్లు కొంతవరకు ఎత్తి, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేసినట్టు ఇక్కడ కిందకు వదిలేస్తారు. పైగా స్పిల్‌వే బ్యారేజీ అంత పెద్దది కాదు. దీంతో ఎగువ భాగంలో వున్న విలీన గ్రామాలన్నీ మునిగిపోతాయి. కొన్ని గ్రామాల వారికి పునరావాస కాలనీలు నిర్మించారు. కానీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించలేదు. దేవీపట్నం, పూడిపల్లి గ్రామాల ప్రజలకు కాలనీలు నిర్మించలేదు. వరదల సమయంలో ఇక్కడి వారంతా వేరేచోటకు వెళ్లి తగ్గిన తర్వాత మళ్లీ తిరిగి రావలసిందే. 


వృథాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఉపయోగపడేలా గత ప్రభుత్వం చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంపై వైసీసీ ప్రభుత్వం ఫిర్యాదు చేసి పక్కన పెట్టింది. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యికి చేరువలో వుంది. సబ్సిడీ మాత్రం రూ.25కి మించట్లేదు. నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. దీంతో ఇంటి బడ్జెట్‌ పెరిగిపోతోంది. పెట్రోలు ధర  రూ.100 సమీపిస్తోంది. డీజిలు ధరా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ కారణంగా వాహనచోదకులపై అదనపు భారం పడుతోంది. పెట్రో ధరల పెంపుతో రవాణా చార్జీలు పెరిగాయి. ఆటో, వ్యాన్‌, కారు డ్రైవర్లు ఇబ్బందిపడుతున్నారు. సంక్షేమం పేరిట రూ.10వేలు వేసి ఫైన్లు పేరిట అంతకు మించి లాగేస్తున్నారని వారు గోల చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం రెండు, మూడు ఇసుక పాలసీలు తీసుకొచ్చి... చివరకు కార్పొరేట్‌ సంస్థకు అప్పగించి రేట్లు పెంచింది. ఇవాళ టన్ను ఇసుక ధర రూ.475. దానికి ఇతర చార్జీల పేరు చెప్పి రూ.500 వసూలు చేస్తున్నారు. పడవ ర్యాంపుల వద్ద మరో రెండొందలు పెంచుతున్నారు. టన్ను ధర రూ.675 అని చెప్తున్నారు. దీంతో రాజమహేంద్రవరం ప్రజలు గోదావరి నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే  10 టన్నుల లారీకి కేవలం ఇసుకకే రూ.7వేలు చెల్లించాల్సి వస్తోంది. రవాణా చార్జీలు అదనం. 

ఈ రెండేళ్లలో ఇసుక దందాతో పాటు మట్టి, గ్రావెల్‌ దందా పెరిగింది. జగనన్న కాలనీల పేరిట కొండల కొద్దీ గ్రావెల్‌, మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కనీసం సీనరేజీ కూడా కట్టడంలేదు. కొండలు, చెరువు, గోదా వరి లంకలు... ఇలా అన్నిటినీ తవ్వేస్తున్నారు. బ్లాక్‌లో అమ్మి ఆ పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.


ఎమ్మెల్యేలను కలవని సీఎం

 సాధారణంగా నియోజకవర్గాల్లోని సమస్యలను ఎమ్మె ల్యేలు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తుంటారు. కానీ  ముఖ్యమంత్రి జగన్‌ ఎమ్మెల్యేలను ఎవరినీ కలవట్లేదనే విమర్శలు వున్నాయి. ఈ విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసంతృప్తి ఉంది.

చివరిగా కొవిడ్‌ కారణంగా వ్యవస్థలన్నీ అవస్థల్లో పడ్డాయి. రోగమనేది ప్రభుత్వం వల్ల వచ్చింది కాదు. కానీ దాని కట్టడికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే సమస్యలు నెలకొంటున్నాయి. ఇవాళ పరిస్థితి అలానే ఉందనే విమర్శలు ఉన్నాయి.


ఒక్క ఇల్లూ కట్టలేదు

పట్టణ పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన వేలాది ఇళ్లను ఇప్పటికీ పేదలకు అప్పగించలేదు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు, అల్లవరం మండలం బోడసకుర్రుల్లో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చారు. మిగతా ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నిర్మితమై  ఉన్నాయి. లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో అవి మూలన పడిఉన్నాయి. ఇక వైసీపీ ప్రభుత్వం వాటికి రంగులు మార్చిమార్చి కోట్ల రూపాయలు వృధా చేసింది. పేదలందరికీ ఇళ్ల పట్టాలిస్తామని చెప్పి వేల ఎకరాల భూమిని సేకరించారు. కొన్నిచోట్ల లే అవుట్లు కూడా వేశారు. కానీ అక్కడ ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు కాలేదు. ఇంతవరకూ ఒక ఇల్లు కూడా కట్టలేదు. అవ భూముల వివాదం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది.

Updated Date - 2021-05-30T05:35:10+05:30 IST