యాష్‌... వస్తోంది!

ABN , First Publish Date - 2021-05-24T06:05:20+05:30 IST

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

యాష్‌... వస్తోంది!
కొత్తపల్లి మండలం ఉప్పాడలో అలల ఉధృతి

  • భారీ వర్షాలు కురిసే అవకాశం 
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు
  • రైతులను అప్రమత్తం చేయండి 
  • గ్రామాల్లో దండోరా వేయించండి
  • కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయండి: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 23: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నాటికి అల్పపీడనం తుపానుగా మారి వాయువ్య దిశగా పయనించి 26వ తేదీన ఒడిసా-బెంగాల్‌ మధ్య తీరాన్ని తాకనుందన్నారు. ‘యాష్‌’గా నామకరణం చేసిన ఈ తుపాను హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలోని మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు తూర్పు బంగాళాఖాతంలో ఒడిసా, బెంగాల్‌ తీరాల వైపు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. లోతైన సముద్ర వేటలో ఉన్న వారు వెంటనే  తిరిగి తీరానికి చేరుకోవాలని కోరారు. అన్ని కమ్యూనికేషన్‌ వ్యవస్థల ద్వారా మత్స్యకారులందరికీ సమాచారం అందించి వేటలో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను కారణంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనల దృష్ట్యా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసి ధాన్యం, పంటలకు నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. డివిజనల్‌, మండల అధికారులు తమ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. సముద్ర తీర మండలాల్లోని అన్ని గ్రామాల్లో దండోరా, వలంటీర్ల ద్వారా ప్రజలకు తుపాను సమాచారం తెలిపి అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే తీర లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని, ఏ విధమైన ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 


ఉప్పాడ తీరంలో అలల ఉధృతి

ఉప్పాడ (కొత్తపల్లి), మే 23: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆదివారం ఉప్పాడ తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల వరకు సముద్రం ప్రశాంతంగానే ఉంది. 5.30 దాటాక కెరటాల ఉధృతి పెరిగింది. కెరటాలు నిటారుగా కాకుండా అడ్డుగా విరగడంతో తుపాను వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు.

Updated Date - 2021-05-24T06:05:20+05:30 IST