మహిళా చట్టాలపై అవగాహన అవసరం

ABN , First Publish Date - 2021-12-10T05:28:52+05:30 IST

మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, దిద్దుబాటు చట్టం-2013పై మహిళా ఉద్యోగులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని రక్షణ హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కె.జయశ్రీ సూచించారు.

మహిళా చట్టాలపై అవగాహన అవసరం
మాట్లాడుతున్న జయశ్రీ

కాకినాడ సిటీ, డిసెంబరు 9: మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, దిద్దుబాటు చట్టం-2013పై మహిళా ఉద్యోగులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకుని రక్షణ హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కె.జయశ్రీ సూచించారు. చట్టం 8వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్‌లో జిల్లా మహిళా, శిశు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు జయశ్రీ మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు ప్రతి కార్యాలయంలోను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ఉంటుందని, ఈ కమిటీకి చైర్‌పర్సన్‌, ముగ్గురు ఇతర సభ్యులు ఉంటారని వివరించారు. మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే జాప్యం చేయకుండా వెంటనే ఈ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలన్నారు.     ఐసీడీఎస్‌ పీడీ జి.సత్యవేణి మాట్లాడుతూ చట్టంపై మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఫిర్యాదు చేసిన మహిళకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు. డీసీపీవో సీహెచ్‌.వెంకటరావు, పీడీ జ్యోతిర్మయి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో మీనాక్షి, దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, వివిధ విభాగాల  అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-10T05:28:52+05:30 IST