ఖరీఫ్‌లోనూ నీటి సమస్యా..?

ABN , First Publish Date - 2021-08-03T06:03:08+05:30 IST

కె.గంగవరం, ఆగస్టు 2: ఇది ఖరీఫ్‌ వరి సీజన్‌. అంటే రైతులకు సాగునీటికి లోటుండదు. పైగా ముంపు సమస్య కూడా వెంటాడుతుంది. ముంపు బారిన పడకుండా తమ పొలాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడతారు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. రబీలో మాదిరిగా నాట్లు పడిన వ

ఖరీఫ్‌లోనూ నీటి సమస్యా..?
శివలలో ఎండిపోయిన వరి పొలం

ఎండిపోతున్న వరి పొలాలు 

ఆందోళన చెందుతున్న రైతాంగం

కె.గంగవరం, ఆగస్టు 2: ఇది ఖరీఫ్‌ వరి సీజన్‌. అంటే రైతులకు సాగునీటికి లోటుండదు. పైగా ముంపు సమస్య కూడా వెంటాడుతుంది. ముంపు బారిన పడకుండా తమ పొలాన్ని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడతారు. కానీ ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది. రబీలో మాదిరిగా నాట్లు పడిన వరి పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు ఇదేం దుస్థితి అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రామచంద్రపురం డివిజన్‌లోని చాలా గ్రామాల్లో ఈసారి సాగునీటి ఎద్దడి ఎదురైంది. ముఖ్యంగా కె.గంగవరం మండలంలోని శివారు పొలాలకు నీరు అందడం లేదు. గత నెలలో విస్తారంగా కురిసిన వానలకు రైతులు నాట్లు ప్రక్రియను పూర్తిచేశారు. ప్రస్తుతం మండలంలో 90 శాతం వరకూ పొలాల్లో నాట్లు వేశారు. ఇప్పుడు ఆ పొలాలకు సాగునీరు అందడం లేదు. పొలాలు బీటలు బారుతున్నాయి. పంట కాలువల నుంచి తగినంత నీరు రాక రైతులు లబోదిబోమంటున్నారు. వర్షం వస్తేబాగుండునని దేవుని వేడుకుంటున్నారు. పంట కాలువలు పూడికతీత పనులు చేయించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని రైతులు చెబుతున్నారు. క్లోజర్‌ సమయంలో పంట కాలువలు తవ్విస్తే సాగునీరు పొలాలకు సవ్యంగా అందేదని, పనులు చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోతున్నారు.


మరో నాలుగు రోజులు ఎండలు ఎక్కువగా కాస్తే నాట్లు మొత్తం ఎండిపోతాయని ఆందోళన చెందుతున్నారు. శివల చానల్‌ పరిధిలో 1100 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో 500 ఎకరాలకు సాగునీటి ఎద్దడి ఉంది. యండగండిలో కాలువ శివారు పొలాలు 200 ఎకరాలకు నీటి ఎద్దడి ఉంది. ఈ రెండు చోట్ల కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో సాగునీరు అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రధాన కాలువల్లో పూడిక తొలగించకపోవడం, ఆక్రమణలు, వ్యర్థాలను పంట కాలువలోకి వేసి అడ్డంకులు కలిగించడం వంటి చర్యలతో నీరు అందడంలేదని, ఇరిగేషన్‌శాఖ సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2021-08-03T06:03:08+05:30 IST