ఇదేం గందరగోళం

ABN , First Publish Date - 2021-01-12T07:36:07+05:30 IST

టిడ్కో లబ్ధిదార్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యాయి. రకరకాల కారణాలు చూపిస్తూ 300 మందిని ఏకంగా అనర్హులుగా చూపించారు.

ఇదేం గందరగోళం
టీడ్కో గృహాలు.. గతంలో ఇచ్చిన మంజూరు పత్రం

అనర్హుల జాబితాలో 300 మంది లబ్ధిదారులు

మొదటి విడత 5,367 టిడ్కో గృహాలకు గానూ 4,708 మందికి పట్టాలు పంపిణీ

గతంలో కట్టిన డీడీ చూపించమంటున్న అధికారులు

నా ఇల్లు నాకిప్పించండంటూ  ఓ లబ్ధిదారుని ఆవేదన

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

టిడ్కో లబ్ధిదార్ల జాబితాలో కొందరి పేర్లు గల్లంతయ్యాయి. రకరకాల కారణాలు చూపిస్తూ 300 మందిని ఏకంగా అనర్హులుగా చూపించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో బొమ్మూరు, ధవళేశ్వరం, తొర్రేడు ప్రాంతాల్లో నిర్మించిన టిడ్కో గృహాల లబ్ధిదార్లను గతంలోనే ఎంపిక చేశారు. చాలామంది లబ్ధిదారుడి వాటా కింద కొంత సొమ్ము కూడా డీడీ రూపంలో కట్టారు. ఇటీవల టిడ్కో ఇళ్ల పట్టాలు పంపిణీ మొదలయ్యేసరికి కొందరి పేర్లు మాయమైపోతున్నాయి. టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం లబ్ధిదార్లకు ఆయా ఫ్లాట్లకు సంబంధించిన పట్టాలు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 5,367 టిడ్కో గృహాల పంపిణీ మొదలుపెట్టారు. ఇప్పటివరకూ 4,708 మందికి పట్టాలిచ్చారు. ఇంకా 600 మందికి పైగా పంపిణీ చేయవలసి ఉంది. కానీ అందులో ఇప్పటికే 300 నుంచి 400 మంది వరకూ  అన ర్హులుగా భావించి పక్కన పెట్టారు. దీనితో లబ్ధిదార్లులో ఆందోళన మొదలైంది. ఇళ్లు కేటాయిస్తున్నారు కదా అని గత లబ్ధిదారులు అధికార్లను సంప్రదిస్తే జాబితాల్లో అన ర్హులుగా కనిపిస్తోంది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. గతంలో లబ్ధిదారుడి వాటా కింద చెల్లించిన సొమ్ముకు సంబంధించిన డీడీ జిరాక్స్‌లను కొందరు దాచుకోలేదు. ఇవాళ సంబంఽధిత డీడీలను చూపిస్తేనే ఇంటి పట్టా ఇస్తామని అధికారులు తెగేసి చెప్పడంతో  కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. తాము గతంలో డీడీ చెల్లించా మని, రికార్డులలో చెక్‌ చేయమని కోరినా, జిరాక్స్‌ ప్రతి చూపిస్తేనే తాము పట్టా ఇవ్వగలమని అధికారులు తేల్చిచెప్పడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా కాళ్ల నీలిమ అనే మహి ళకు 2017లో బొమ్మూరు టిడ్కో గృహాల్లో  ఇల్లు కేటాయించారు. ఎ-37 బ్లాక్‌లో 3వ ఫ్లోర్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ 2ను కేటాయించారు. కానీ మొదట ఆమె లక్ష్మీవారపుపేటలో అద్దె ఇంట్లో ఉండేవారు. తర్వాత పట్టా వచ్చిందనే ధైర్యంతో బొమ్మూరు నవభారత్‌ నగర్‌లో అద్దె ఇంట్లోకి వెళ్లారు. నవరత్నాలు సర్వే సమయంలో నవభారత్‌ నగర్‌లో వలంటీర్లు సర్వే కోసం వస్తే, తనకు బొమ్మూరు టిడ్కో ఇంటిని ఇచ్చా రని ఆమె పట్టా చూపడంతో ఆమెకు ఇల్లు ఉన్నట్టు రికార్డు చేశారు.  లక్ష్మీవారపుపేటలో ఆమె ఉండడం లేదనే కారణంతో ఇక్కడ వలం టీరు అనర్హుల జాబితాలో పెట్టారు. తీరా ఇప్పుడు ఇంటి పట్టా కోసం ఆమె అధికార్లను సంప్రదించగా, ఇందులో పేరు లేదని చెప్పడంతో తెల్లబోయారు. ఈ విషయాన్ని వివరిస్తూ ఇటీవల కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటివరకూ స్పందన లేదు.  



Updated Date - 2021-01-12T07:36:07+05:30 IST