గుళ్లల్లో హుండీలు కొల్లగొడుతున్న నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-12-30T06:59:17+05:30 IST
అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో హుండీల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని బుధవారం కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.

కొత్తపేట, డిసెంబరు 29: అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో హుండీల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని బుధవారం కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. రావులపాలెం సీఐ ఎం.వెంకటనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పి.గన్నవరం మండలానికి చెందిన యర్రంశెట్టి రాజు, చుట్టుగుళ్ల సూర్యప్రకాష్, ఖండవిల్లి రాజు, సరెళ్ల సురేష్ ఒక గ్రూపుగా ఏర్పడి ఏడాదిగా దేవాలయాల్లో హుండీల సొమ్మును దోచేస్తున్నారు. వీరు ఈతకోట-గంటి చెక్‌పోస్టు దగ్గర అనుమానంగా సంచరిస్తుండగా ఎస్‌ఐ మణికుమార్ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. కొత్తపేట శ్రీరామనగర్ రామాలయంలో దొంగిలించిన రూ.1,476 నగదు వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీరు కొత్తపేట పరిధిలో 3, గన్నవరం పరిధిలో 3, అయినవిల్లి పరిధిలో 2, అమలాపురం తాలూకా పరిధిలో ఒకటి, అల్లవరం పీఎస్ పరిధిలో ఒకటి చోరీలకు పాల్పడ్డారు. నిందితులను అరెస్టుచేసి కొత్తపేట కోర్టుకు తరలించారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచి అమలాపురం డీఎస్పీ, రావులపాలెం సీఐ, కొత్తపేట ఎస్‌ఐ, సిబ్బందిని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు అభినందించారు.