తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై పెరిగిన దాడులు

ABN , First Publish Date - 2021-08-27T05:33:54+05:30 IST

ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రైస్తవ దైవసేవకులు, పరిచారకులపై దాడులు పెరిగిపోయాయని క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై పెరిగిన దాడులు

  • క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రతినిధులు
  • సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 26: ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రైస్తవ దైవసేవకులు, పరిచారకులపై దాడులు పెరిగిపోయాయని క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళం వ్యవస్థాపక అధ్యక్షుడు పాల్‌ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ఏపీ స్టేట్‌ ప్రెసిడెంట్‌ స్టీఫెన్‌బాబు, రాష్ట్ర నాయకులు రెవరెండ్‌ నెల్సన్‌, జిల్లా ప్రెసిడెంట్‌ పీఎం రాజు మాట్లాడుతూ విశాఖపట్నానికి చెందిన పాస్టర్‌ హనీ జాన్సన్‌ను మత విద్వేషాలను రెచ్చగొట్టారనే అభియోగంతో తెలంగాణ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేసి ఈనెల 16నఅక్రమంగా అరెస్ట్‌ చేశారని, వెంటనే ఆయన్ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శివశక్తికి చెందిన సంస్థలు, ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల వ్యక్తులు, ఇంకొందరు యేసుక్రీస్తుపై దూషణ మాటలు, లఘుచిత్రాలతో రెచ్చగొట్టేలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిని తిప్పికొడుతూ అనేక మంది క్రైస్తవ సంఘనాయకులు ప్రతి సమాధానం ఇచ్చారని, ఈ నేపథ్యంలో పాస్టర్‌ హనీజాన్సన్‌ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తే దాన్ని సాకుగా తీసుకుని తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం సంప్రదించి జాన్సన్‌పై నమోదైన కేసులు కొట్టేసేలా సహకరించాలని వారు కోరారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ కోశాధికారి వేణుబాబు, సంయుక్త కార్యదర్శి శేఖర్‌బాబు, జిల్లా, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T05:33:54+05:30 IST