చేతకాకపోతే రాజీనామా చేయండి!

ABN , First Publish Date - 2021-11-26T07:10:24+05:30 IST

కోనసీమలో రోడ్లు రూపురేఖలు లేకుండా అధ్వానస్థితికి చేరుకున్నప్పటికీ ఇక్కడి ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టయినా లేదని, మీకు చేతకాకపోతే వారి తమ పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

చేతకాకపోతే రాజీనామా చేయండి!
రావులపాలెం-కొత్తపేట ప్రధాన రహదారిలో సూట్‌కేసులు మోస్తూ నిరసన తెలియజేస్తున్న టీడీపీ నేతలు బండారు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఆనందరావు తదితరులు

  • కోనసీమ ప్రజాప్రతినిధులపై టీడీపీ ఫైర్‌
  • కొత్తపేట రోడ్డులో వినూత్న నిరసన

కొత్తపేట, నవంబరు 25: కోనసీమలో రోడ్లు రూపురేఖలు లేకుండా అధ్వానస్థితికి చేరుకున్నప్పటికీ ఇక్కడి ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టయినా లేదని, మీకు చేతకాకపోతే వారి తమ పదవులకు రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం రావులపాలెం- అమలాపురం రోడ్డులో కొత్తపేట వద్ద ప్రధాన రహదారిపై ఆ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, అమలాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షరాలు రెడ్డి అనంతకుమారి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, పార్టీ నేతలు గంటి హరీష్‌మాధుర్‌, ఆకుల రామకృష్ణ తదితరులు ఆ రహదారిపై అరటి మొక్కలు నాటి, సూట్‌కేసులు మోస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే రోడ్డు కోనసీమకే వెన్నెముక వంటిదని, ఐదు నియోజకవర్గాల్లోని 15 లక్షల మంది ప్రజలకు ముఖ్యమైన రహదారి శిథిలమైనప్పటికీ పట్టించుకోకపోవడంపై వారు మండిపడ్డారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేక ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. తక్షణం రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొండంగి మమత, చిలువూరి సతీష్‌రాజు, ధర్నాల రామకృష్ణ, గుబ్బల మూర్తి, బూశి భాస్కరరావు, బూశి జయలక్ష్మి, విళ్ల వీరమారుతీ ప్రసాద్‌, ముత్యాల బాబ్జీ, యల్లమిల్లి జగన్మోహన్‌, పల్లి భీమారావు, అద్దంకి చంటిబాబు, ముద్రగడ సుబ్బారావు, బయ్యే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-26T07:10:24+05:30 IST