పసుపు దళం..ఉద్యమ పథం

ABN , First Publish Date - 2021-12-28T06:40:23+05:30 IST

ఓటీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా తెలుగుదేశం పార్టీ గళమెత్తింది. ఎన్నో ఏళ్ల కిందట పేదలు కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ప్రభుత్వం వేలకు వేలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించింది.

పసుపు దళం..ఉద్యమ పథం
గళమెత్తిన టీడీపీ

  ఓటీఎస్‌కు వ్యతిరేకంగా  గళమెత్తిన టీడీపీ
   కలెక్టరేట్‌ లోపలకు వెళ్లకుండా రాజప్ప, నెహ్రూ, వర్మ, రామకృష్ణారెడ్డి, కొండబాబు, రాజా తదితర నేతల అడ్డగింత
  బారికేడ్లు అడ్డంగా పెట్టి వెనక్కి నెట్టేసిన పోలీసులు
  నిరసనగా రోడ్డుపైనే బైఠాయించిన నేతలు
  మేం దొంగలమా అంటూ నెహ్రూ ఆగ్రహం
  అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) ఓటీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా తెలుగుదేశం పార్టీ గళమెత్తింది. ఎన్నో ఏళ్ల కిందట పేదలు కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ప్రభుత్వం వేలకు వేలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించింది. తక్షణం పథకాన్ని రద్దు చేసి పేదలను పీక్కుతినడం ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం కాకినాడలో ‘చలో కలెక్టరేట్‌’ నిర్వహించింది. టీడీపీ జిల్లా కార్యాలయం నుంచ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితర నేతలు ప్రదర్శనగా కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే కలెక్టరేట్‌ లోపలకు వెళ్లకుండా వీరిని పోలీసులు అడ్డుకుని నెట్టేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేం దొంగలమా అంటూ నెహ్రూ పోలీసులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం నిరసనగా రోడ్డుపైనే బైఠాయించారు.  వన్‌టైం సెటిల్‌మెంట్‌ పేరుతో మూడు దశాబ్దాల కిందట నిర్మించిన ఇళ్లకు సైతం ఇప్పుడు వేలకు వేలు డబ్బులు కట్టాలంటూ ప్రభుత్వం కొన్ని వారాలుగా పేదలపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీఎస్‌ రద్దు చేయాలంటూ టీడీపీ మొదటి నుంచీ జిల్లావ్యాప్తంగా ఉద్యమిస్తోంది. అయితే ఉగాది వరకు డబ్బులు వసూలు కొనసాగించాలని ఇటీవల సీఎం జగన్‌ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసింది.  ఇందులో భాగంగా సోమవారం ‘చలో కలెక్టరేట్‌’కు పిలుపునిచ్చింది. దీంతో పార్టీ నేతలంతా ఉదయాన్నే కాకినాడలోని జిల్లా ప్రదాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో చినరాజప్ప, నెహ్రూ, వర్మ, రామకృష్ణారెడ్డి, కొండబాబు, సుబ్రహ్మణ్యం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గ ఇన్‌చార్జులు వరుపుల రాజా, కృష్ణుడు తదితరులు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరారు. సీఎం జగన్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేస్తూ తక్షణం పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నేతలంతా కలెక్టరేట్‌కు చేరుకునేసరికి పోలీసులు భారీగా మోహరించారు. వారు లోపలకు వెళ్లకుండా అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.  దీంతో టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లు తొలగిస్తే కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తామన్నారు. ఇందుకు పోలీసులు అంగీకరించలేదు. దీంతో గేట్లను నెట్టేందుకు పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేయగా  పోలీసులు అడ్డుకుని వెనక్కునేట్టేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును నెహ్రూ తీవ్రంగా తప్పుబట్టారు. బారికేడ్లు అడ్డంగా ఉంచి తమను లోపలకు పంపకుండా చేస్తున్నారని.. తాము దొంగలమా? అని నిలదీశారు. అనంతరం పోలీసుల తీరుకు నిరసనగా నేతలంతా రోడ్డుపైనే బైఠాయించారు. కాసేపటికి కలెక్టరేట్‌ లోపలకు వెళ్లడానికి టీడీపీ నాయకులు కొందరికే అనుమతి ఇవ్వడంతో చినరాజప్ప, కొండబాబు, వర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, మోకా ఆనంద్‌సాగర్‌ తదితరులు ‘స్పందన’లో వున్న కలెక్టర్‌ వద్దకు వెళ్లి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ఓటీఎస్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదలను ఇబ్బందులపాల్జేస్తోందని మండిపడ్డారు. ఓటీఎస్‌ స్వచ్ఛందమేనని, బలవంతం లేదని ప్రభుత్వం బయటకు చెప్తున్నా లబ్ధిదారులను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల రక్తాన్ని తాగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పథకాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం  పేదల రక్తాన్ని తాగేందుకే ఓటీఎస్‌ను తీసుకొచ్చిందని తాము అధికారంలోకి రాగానే ఓటీఎస్‌ను రద్దు చేసి       పేదలకు ఉచితంగా  పట్టాలు ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. నెహ్రూ, వర్మ, రామకృష్ణారెడ్డి, కొండాబు,   రాజా మాట్లాడుతూ నియోజకవర్గాల్లో వలంటీర్లు, వైసీపీ నేతలు రకరకాలుగా పేదలను ఓటీఎస్‌ పేరుతో బెదిరిస్తూ డబ్బులు కట్టకపోతే పథకాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు ఈ బకాయిలను ఎప్పుడో తీర్చేసినా అబద్దాలతో ప్రజల నుంచి జగన్‌ ప్రభుత్వం కోట్లకుకోట్లు వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ పార్లమెంటరీ ఇన్‌చార్జి జ్యోతుల నవీన్‌ మాట్లాడుతూ ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రజలను బెదిరిస్తోందన్నారు. దీని గురించి ఇక ఎవరూ భయపడవద్దని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఓటీఎస్‌ రద్దుపైనేనని తెలిపారు. నిత్యావసర ధరలు, మద్యం ధరలు తగ్గించకుండా ప్రగల్బాలు పలుకుతున్న వైసీపీ ప్రభుత్వం ఈ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.
Updated Date - 2021-12-28T06:40:23+05:30 IST