విద్యార్థులకు మంచి చేయడం మానవ నైజం
ABN , First Publish Date - 2021-11-21T07:06:23+05:30 IST
విద్యార్థులకు మంచి చేయడం మానవ నైజమని రామన్ మెగసెసే అవార్డీ, సఫాయి కర్మచారీ ఆందోళన్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ బెజవాడ విల్సన్ అన్నారు.

రామన్ మెగసెసే అవార్డీ డాక్టర్ బెజవాడ విల్సన్
జేఎన్టీయూకే, నవంబరు 20: విద్యార్థులకు మంచి చేయడం మానవ నైజమని రామన్ మెగసెసే అవార్డీ, సఫాయి కర్మచారీ ఆందోళన్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ బెజవాడ విల్సన్ అన్నారు. కాకినాడలోని జేఎన్‌టీయూకే వర్సిటీ అలూమ్ని ఆడిటోరియంలో సంకురాత్రి ఫౌండేషన్, జేఎన్టీయూకే సంయుక్తంగా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే అంశంపై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విల్సన్, గౌరవ అతిథులుగా సంకురాత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్, ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు, మాజీ వీసీ అల్లం అప్పారావు, సంఘ సంస్కర్త శేషుకుమారి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్‌దినకర్, రిజిస్ట్రార్ ఎల్.సుమలత పాల్గొన్నారు. విల్సన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య ద్వారానే కాకుండా సేవల వల్ల కూడా ఉన్నతస్థానానికి ఎదిగేలా విలువలు నేర్పించాలన్నారు. ఆడ, మగ సమానులేనని, వివక్షత లేని జీవితం అందరికీ అందాలన్నారు. పారిశుధ్యం కేవలం ఒక కులానికి చెందిన వృత్తికాదని ఎవరికివారు తమ పరిసరాలను శుభ్రపరచుకునే అలోచన ఉండాలన్నారు. ప్రతిఏడాది మురుగు కాలువలో పడి ఎందరో ప్రాణాలు వదులుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ రచించిన ఏబుక్ గేట్ వే టు జాబ్స్ అనే పుస్తకాన్ని వీసీ ప్రసాదరాజు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ రవీంద్రనాధ్, యూసీఈకే ప్రిన్సిపాల్ బాలకృష్ణ, సంకురాత్రి పౌండేషన్ సీఈవో రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.