సామాజిక స్ఫూర్తితో నిరంతర సాహితీ యజ్ఞం

ABN , First Publish Date - 2021-11-22T05:10:44+05:30 IST

కవులు సామాజిక దృక్పథం కలిగి రచనలు సాగించాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

సామాజిక స్ఫూర్తితో నిరంతర సాహితీ యజ్ఞం

 రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌  శ్రీలక్ష్మి

అమలాపురం రూరల్‌, నవంబరు 21: కవులు సామాజిక దృక్పథం కలిగి రచనలు సాగించాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సామాజిక స్ఫూర్తితో నిరంతర సాహితీ యజ్ఞం కొనసాగిస్తున్న శ్రీశ్రీకళావేదిక కృషి ప్రశంసనీయమన్నారు. భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జాతీయస్థాయి శతకవి సమ్మేళనం ఘ నంగా నిర్వహించారు. శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ సాహిత్య, సేవా సామాజిక సంస్థ, ఏపీ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కళాలు, గళాలు పేరిట నిర్వహించిన కవి సమ్మేళనానికి  కళావేదిక జిల్లా అధ్యక్షుడు మిరప మహేష్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అకాడమీ చైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ సాహిత్య అకాడమీ ద్వారా కవులకు గుర్తింపు తీసుకురావడమే కాకుండా వారిని ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అకాడమీ ఆధ్వర్యంలో కవులను ప్రోత్సహించే లక్ష్యంతో పుస్తక ప్రచురణలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. శ్రీశ్రీకళావేదిక అంతర్జాతీయ చైర్మన్‌ డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ మాట్లాడుతూ సాహితీ యజ్ఞంలో భాగంగా  ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కవులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయస్థాయి శతకవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం కళావేదిక జిల్లా కార్యవర్గ  సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, సవాళ్లను వివరిస్తూ వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన 120 మంది కవులు కవితాగానంచేసి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కవులు నల్లా నరసింహమూర్తి, బీవీవీ సత్యనారాయణలను అక్షరరత్న బిరుదులతో సత్కరించారు. అనంతరం డాక్టర్‌ ప్రతాప్‌ను సత్కరించారు. సంగీత సాహిత్యాలతో పాటు సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తున్న బీవీసీ కళాశాల చైర్మన్‌ బోనం కృష్ణసతీష్‌ను సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర దృశ్యకళల అకాడమీ చైర్‌పర్సన్‌ కుడుపూడి సత్యశైలజ, కళావేదిక జాతీయ కార్యవర్గ ప్రతినిధులు ఆరవల్లి నరేంద్ర, కొల్లి రమావతి, చిట్టే లలిత, రిషి, కుంపట్ల సుభాషిణి, ఎన్‌.అశోక్‌, ఎన్‌. సంపత్‌, వాసి జోత్స్న, పుల్లేటికుర్తి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-22T05:10:44+05:30 IST