‘నన్ను బాధపెట్టినవాళ్లు బాగానే ఉన్నారు.. నేను మాత్రం అవమానాలతో బతుకుతున్నా..’

ABN , First Publish Date - 2021-02-05T08:11:04+05:30 IST

శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్..

‘నన్ను బాధపెట్టినవాళ్లు బాగానే ఉన్నారు.. నేను మాత్రం అవమానాలతో బతుకుతున్నా..’
ఇండుగుమిల్లి ప్రసాద్(ఫైల్‌ఫొటో)

శిరోముండనం బాధితుడు ప్రసాద్‌ అదృశ్యం 

నిందితులు ఎన్నికల్లో.. 

నా బతుకు అవమానాల్లోనంటూ వెళ్లేముందు వేదన


సీతానగరం(తూర్పు గోదావరి): శిరోముండనం బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌ బుధవారం సాయంత్రం నుంచి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండలంలో సంచలనం రేకెత్తించింది. కాటవరం పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ల కార్యక్రమానికి టీడీపీ తరపున వార్డు మెంబర్లుగా నామినేషన్‌కు వెళుతున్న అభ్యర్థులతో కలిసి కాటవరం పంచాయతీవద్దకు వెళ్లాడు. అక్కడ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చి భార్య కౌశల్యం భోజనం వడ్డించగా, తనను బాధపెట్టినవాళ్లు బాగానే ఉన్నారని, ప్రస్తుతం నామినేషన్లు వేసుకుని హాయిగా తిరుగుతున్నారని, తాను మాత్రం అవమానాలతో బతుకుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ భోజనం కూడా సరిగా తినకుండా సెల్‌ చార్జింగ్‌లో పెట్టి, మోటార్‌ సైకిల్‌ ఇంటివద్దనే వదిలేసి బయటకు వెళ్లిపోయాడని ఆమె తెలిపింది.


ఎంతకూ తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు విషయం మునికూడలి గ్రామంలోని పికెట్‌ వద్ద ఉన్న కానిస్టేబుల్‌కు, సీతానగరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సుధాకర్‌ రాత్రి సుమారు 12 గంటలకు బాధితుని ఇంటికి వెళ్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికలకుగాను నామినేషన్ల పర్వం నడుస్తుండగా జరిగిన ఈ సంఘటన జరగడం గ్రామంలో చర్చనీయాంశమైంది. శిరోముండనం బాధితునికి వివాహమై నేటికి నాలుగు నెలలు మాత్రమే అయ్యింది. బాధితునికి తల్లిదండ్రులు, ఇద్దరు అన్నయ్యలున్నారు. వారంతా ప్రసాద్‌ ఆచూకీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.


శిరోముండనం కేసులో న్యాయం జరగకపోవడం వల్లే.. నా కొడుకు దూరమయ్యాడు: తండ్రి గంగరాజు

నా కొడుకు ప్రసాద్‌కు శిరోముండనం చేసి అవమానించి నేటికి ఏడు నెలలు కావస్తున్నా ఇంతవరకు న్యాయం చేయలేదు. నిందితులు హాయిగా నిర్బయంగా తిరుగుతూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు వేసుకుంటున్నారు. ఇంకా నా కొడుకు అవమానాల బారిన పడుతూనే ఉన్నాడు. న్యాయం జరగకపోవడం వల్లే ఇలా జరిగింది. నా కొడుకు నాకు దూరమయ్యాడు. నా కొడుకు లేకుంటే నా జీవితం ఎందుకు అంటూ బోరున విలపిస్తున్నాడు. నా కొడుకు బతికే ఉన్నాడని ఒక్కమాట చెప్పండి అంటూ అధికారులను వేడుకుంటున్న తీరు చూపరులను కలచివేస్తోంది. శిరోముండనం కేసులో నిందితుడు సర్పంచ్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated Date - 2021-02-05T08:11:04+05:30 IST