స్ర్కూట్నీలో తిరస్కరణ
ABN , First Publish Date - 2021-02-06T07:23:48+05:30 IST
రెండోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తర్వాత శుక్రవారం పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీతానగరం పంచాయతీ కార్యాలయంవద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి.

- టీడీపీ బలపరిచిన అభ్యర్థి నామినేషన్‌పై వైసీపీ అభ్యంతరం
- ముగ్గురు సంతానం, ఇద్దరు భార్యలు ఉన్నారని ఆరోపణ
- సీతానగరం పంచాయతీలో నాటకీయ పరిణామాలు
సీతానగరం, ఫిబ్రవరి 5: రెండోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తర్వాత శుక్రవారం పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీతానగరం పంచాయతీ కార్యాలయంవద్ద నాటకీయ పరిణామాలు జరిగాయి. టీడీపీ అభ్యర్థికి ఇద్దరు భార్యలు, ముగ్గురు సం తానం ఉన్నారని వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై తాము వివరణ ఇస్తుండగా బయటనుంచి వచ్చిన ఒక ఫోన్‌కాల్‌తో అధికారుల తీరు మారిపోయిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు భార్యలు ఉన్నారంటూ వైసీపీ నాయకులు ఓటరు ఐడీ కార్డులు చూపించడం ఆర్‌వో సిమ్మిరాజు దొర దీని పై విచారణకు ఆదేశించడం, అక్కడే ఉన్న వీఆర్వో క్షణాల్లో రిపోర్టు రాయడం, రిపోర్టు వచ్చిన కొద్దిసేపటికే టీడీపీ అభ్యర్థికి ముగ్గురు సం తానం కావడం కారణం చూపించి నామినేషన్ తిరస్కరించడం జరిగిపోయాయి. వెంటనే వైసీపీ నాయకులు అక్కడినుంచి వెళ్లిపోగా టీడీపీ నాయకులు అధికారులతో వాదనకు దిగారు. నిజానిజాలు తెలుసుకోకుండా నిర్ణయం తీసుకోవడం తగదని, నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. నోటీస్ బోర్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థిపేరు లేకుండా మిగిలిన అభ్యర్థుల పేర్లు పెట్టడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అనంతరం వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న టీడీపీ బలపరిచిన అభ్యర్థి రెండో భార్య పోసమ్మను తీసుకువస్తామని, విచారించి ఆమె వాగ్మూలం తీసుకుని న్యాయం చేయమని నాయకులు కోరారు. వెంటనే ఆమెను సీతానగరం పంచాయతీ కార్యాలయానికి తీసుకువచ్చారు. టీడీపీ అభ్యర్థి బంటుమిల్లి వెంకటేశ్వర్లుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తన భర్త ఎప్పు డో తనను వదిలేసి వెళ్లిపోయాడని, ఇటువంటి గొడవల్లో తనను లాగవద్దని ఆమె చెప్పింది. దీన్ని రాతపూర్వకంగా ఇవ్వమని ఆర్‌వో కోరగా ఆమె రాసిచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెం దుర్తి వెంకటేష్ ఆర్‌వోతో మాట్లాడుతూ విచారణ చేసే అధికారం మీకు లేదని, ఇంతమంది పిల్లలు ఉన్నారని సర్టిఫికెట్ ఇచ్చే అధికారం వీఆర్వోకు లేదని, దీనిపై తిరస్కరణ చేసే అధికారం ఆర్‌వోకు లేదని అన్నారు. మీరు ఏ కారణంతో నామినేషన్ తిరస్కరించారో రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఆర్‌వో తటపాటాయించడంతో ఇస్తే తిరస్కరణకు కారణం రాతపూర్వకంగా ఇవ్వండి లేదా అభ్యర్థిని పోటీలో ఉంచండన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్లడానికైనా సిద్ధమని నాయకులు తెలిపారు. రాత్రి పది గంటల వరకు టీడీపీ నాయకులు అధికారులను బయటకు వెళ్లనివ్వలేదు. తమకు కారణం తెలియజేస్తూ లేఖ ఇవ్వండి లేదా అభ్యర్థికి పోటీ చేసే అవకాశం ఇవ్వండి, లేదంటే ఇక్కడనుంచి వెళ్లమని బైఠాయించారు.