కార్తీకమాస ఏర్పాట్లపై సమీక్ష

ABN , First Publish Date - 2021-10-07T05:45:55+05:30 IST

సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసం సందర్భంగా ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నిశాఖలు సమన్వయంతో ముందుకెళ్లి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు.

కార్తీకమాస ఏర్పాట్లపై సమీక్ష
కార్తీకమాస ఏర్పాట్లపై సమీక్ష

అన్నవరం, అక్టోబరు 6: సత్యదేవుడి సన్నిధికి కార్తీకమాసం సందర్భంగా ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నిశాఖలు సమన్వయంతో ముందుకెళ్లి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ అన్నారు. భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై బుధవారం సత్యగిరిపై ఉచిత కల్యాణ మండపంలో ఆర్డీవో వెంకటరమణ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.  కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రధానంగా భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఎస్‌ఐ రవికుమార్‌ను ఆదేశించారు. భారీ వాహనాలను పైకి అనుమతించకుండా కార్లకోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్‌ కంటోల్ర్‌రూం ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా అవసరమైన చోట్ల నిఘా కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షణ చేస్తామని అన్నారు. అదనపు క్యూలైన్లను ఏర్పాటుచేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.  నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండాలని ప్రధానంగా నెలరోజులు ఇరువైపులా ఉన్న ఆర్చి వరకు  సెంట్రల్‌ లైటింగ్‌కు సరఫరా పునరుద్ధరించాలని ఎలక్ట్రికల్‌ డీఈని ఆదేశించారు. నెలరోజులు కొండదిగువున, కొండపైన మెడికల్‌ క్యాంపులు  ఏర్పాటు చేయాలని వైద్యాధికారి డాక్టర్‌ రవికుమార్‌కు సూచించారు. ఆర్టీసీ 20 ప్రత్యేక బస్సులు నడుపుతుందని తుని డిపో మేనేజర్‌ పద్మావతి చెప్పారు. గిరిప్రదక్షిణపై అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సూచించినట్లు ఈవో త్రినాథరావు చెప్పారు. నవంబరు 16న పంపా సరోవరంలో జరిగే స్వామివారి తెప్పోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.  చిన్నపిల్లలకు ఉచితంగా పాలు, బిస్కెట్‌ ప్యాకెట్లను భక్తులకు నిరంతరాయంగా ఉచిత పులిహోర, దద్ధ్యోధనం ప్రసాదం వితరణ చేపడతామని ఈవో త్రినాథరావు పేర్కొన్నారు. ఈనెల 31న ప్రారంభమయ్యే సత్యదీక్షలకు సంబందించి 500మంది గిరిజనులకు ఉచితంగా దీక్షావస్త్రాలను అందజేయాలని నిర్ణయించారు. సమావేశంలో చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ట్రస్టీలు ముత్యాల వీరభద్రరావు, రాజశేఖర రెడ్డి, పీఆర్వో కొండలరావు, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-07T05:45:55+05:30 IST