సార్వా వరి కోతలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-31T06:43:37+05:30 IST

డెల్టాలో సార్వా వరికోతలు మొదలయ్యాయి. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా రామచంద్రపురం డివిజన్‌లో బోర్లుపై సాగుచేసిన రైతులకు ముందస్తుగా పంట రావడంతో కోతలు ప్రారంభిం చారు.

సార్వా వరి కోతలు ప్రారంభం
మండపేటలో మిషన్‌తో వరికోత దృశ్యం

 ఎకరాకు 25 బస్తాల మేర దిగుబడి 

 అకాలవర్షంతో అన్నదాతకు తీరని కష్టం

మండపేట, అక్టోబరు 30 : డెల్టాలో సార్వా వరికోతలు మొదలయ్యాయి. జిల్లాలో 2.25 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా రామచంద్రపురం డివిజన్‌లో బోర్లుపై సాగుచేసిన రైతులకు ముందస్తుగా పంట రావడంతో కోతలు ప్రారంభిం చారు. ఈ డివిజన్‌లోని మండపేట, ఆలమూరు, అనపర్తి, కపిలేశ్వరపురం, రాయవరం, బిక్కవోలు మండలాల్లో దాదాపుగా కోతలకు శ్రీకారంచుట్టారు. ఈ ఏడాది ఎక్కువగా స్వర్ణరకం సాగు చేశారు. వాతావరణంతో మార్పులు, అకాలవర్షాలు, ఈదురుగాలుల వల్ల వరి చేలు నేలకువాలాయి. దీంతో దిగుబడి కూడా ఎకరాకు 5 బస్తాల వరకు తగ్గి 25 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. గింజదశలో కురిసిన వర్షం వల్ల గింజ పాలుపోసుకోకపోవడంతో పొల్లుకాయ పెరిగింది. దీని ప్రభావంతో దిగుబడి పడిపోయిందని మండపేట వ్యవసాయాధికారి బలుసు రవి చెప్పారు. ఇక సాగుకు పెరిగిన వ్యయం కూడా రైతుకు భారంగా మారింది. గతేడాదికి ఇప్పటికి డీజిల్‌ ధర పెరగడంతోపాటు ఎరువుల ధరలు, కూలీల రేట్లు పెరిగాయి. ముఖ్యంగా కూలీల రేటు రూ.700 నుంచి రూ.800 వరకు ఉంది. ఇటు వరికోత మిషన్‌ గతేడాది గంటకు రూ.2వేలు వసూలు చేస్తే ఇప్పుడు రూ.2600కి చేరింది. ఎకరా పడిన వరి కోసేందుకు నాలుగు గంటల సమయం పడుతుంది. ధాన్యం కు గిట్టుబాటు ధర కల్పించి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2021-10-31T06:43:37+05:30 IST