పగలు ఇసుక తవ్వకాలు.. రాత్రిళ్లు అక్రమ విక్రయం
ABN , First Publish Date - 2021-01-12T07:17:39+05:30 IST
ఇళ్ల స్థలాల మెరక ముసుగులో ఇసుక అక్రమ విక్రయాలు సాగిస్తున్నారు.

ఇళ్ల స్థలాల మెరక ముసుగులో
ముమ్మిడివరం, జనవరి 11: ఇళ్ల స్థలాల మెరక ముసుగులో ఇసుక అక్రమ విక్రయాలు సాగిస్తున్నారు. నదీగర్భంలోనే ర్యాంపును ఏర్పాటుచేసి జేసీబీ సాయంతో వందలాది ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకు పోతున్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరి ధిలోని గురుకుల పాఠశాల సమీపంలో పది ఎకరాల భూమిని 600మంది పేదలకు ఇళ్ల స్థల పట్టాలుగా ఇచ్చారు. ఈభూమిని మెరకచేసి అంతర్గత గ్రావెల్ రోడ్లు వేసేందుకు పంట బోదెకు వంతెన నిర్మించేం దుకు రూ.1.37కోట్లతో ఇంజనీరింగ్ అధికారులు అంచ నాలు రూపొందించారు. అయితే ఈపనిని కొందరు వైసీపీ నాయకులు చేజిక్కంచుకుని గోదావరి గర్భం నుంచి ఇసుకను తరలించి ఆ ఇళ్ల స్థలాల భూమి మెరక పనులు చేపట్టారు. పగలు ఆ లేఅవుట్‌లోకి నామమాత్రంగా ఇసుకను తరలిస్తుండగా రాత్రుళ్లు ప్రైవేటు వ్యక్తులకు ఇసుక విక్రయిస్తున్నారు. ట్రాక్టరు రూ.3వేల నుంచి రూ.3500 వరకు విక్రయాలు జరుపు తున్నట్టు సమాచారం. ప్రతీరోజు 200కుపైగా ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతుంది. అక్కడ లభించే ఇసుక గరుకుగా ఉండడంతో ఇళ్ల నిర్మాణానికి వినియో గదారులు ఎగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. నదీగర్భంలో ఎక్స్‌కవేటరుతో ఏవిధమైన తవ్వకాలు చేపట్టరాదనే నిబంధన ఉంది. అక్కడ ఇసుక తీయాలంటే హెడ్‌వర్క్స్, మైన్స్, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. వారి అనుమతి లేకుండా కేవలం రెవెన్యూ అధికారుల అనుమతితోనే ఇళ్లస్థలాల మెరక పనులకు ఇసుకను తరలిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ముమ్మిడివరం తహశీల్దార్‌ను వివరణ కోరగా.... ఇళ్లస్థలాల లేఅవుట్లను అత్యవసరంగా మెరక చేయవలసి ఉన్నందున ఇసుక తీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఆ మేరకే తాము అనుమతి ఇచ్చినట్టు చెప్పారు.